దక్షిణ తెలంగాణ సస్యశ్యామలానికి స్పెషల్ మాస్టర్ ప్లాన్
- గత పదేళ్లో వెనకబాటుకు గురైన క్రమంలో నీళ్లు, నిధుల్లో ప్రత్యేక ప్రాధాన్యత
- ఉత్తర తెలంగాణ జిల్లాలతో సమానంగా తీర్చిదిద్దేందుకు కీలక నిర్ణయం
- ఈ దిశగా సీఎం రేవంత్ కార్యాచరణ, అంతర్గత సర్వేలతో వెనకబాటుపై అధ్యయనం
- ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, పారిశ్రామిక పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు
- కరువు ఆనవాళ్లు కనిపించకుండా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు
- వలసల ప్రాంతం నుంచి స్థానిక ఉపాధి కేంద్రంగా మారే దిశగా అడుగులు
- ఐదు జిల్లాలు.. ఐదు ప్రత్యేక ఆర్థిక బలాలు
- పాలమూరు నేలపై మారబోతున్న ఆర్థిక చిత్రం
- సాగునీటి విస్తరణతో వ్యవసాయానికి కొత్త ఊపిరి
హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : తెలంగాణ అభివృద్ధి కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దక్షిణ తెలంగాణలో చోటుచేసుకుంటున్న మార్పులను పరిశీలించాల్సిందే. ఒకప్పుడు కరువు, వలసలు, సాగునీటి కొరతకు ప్రతీకగా నిలిచిన పాలమూరు ప్రాంతం ఇప్పుడు కొత్త ఆర్థిక అవకాశాల కోసం అడుగులు వేస్తోంది. సాగునీటి ప్రాజెక్టులు, హైదరాబాద్‌కు సమీపం, వ్యవసాయ విస్తరణ, పశుసంపద, అటవీ వనరులు, చిన్న పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు ఈ ప్రాంతానికి కొత్త అవకాశాలను తెస్తున్నాయి. మహబూబ్‌నగర్‌తో పాటు వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ ప్రాంతీయంగా ప్రత్యేకమైన ఆర్థిక బలాలు ఉన్నాయి. అయితే వనరులు పెరగడం మాత్రమే అభివృద్ధికి కొలమానం కాదు. రైతు ఆదాయం ఎంత పెరిగింది? స్థానికంగా ఎన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి? వ్యవసాయ ఉత్పత్తులకు ఎంత విలువ జోడించగలుగుతున్నాం? పరిశ్రమలు, పట్టణీకరణ ఎంత విస్తరించాయి? అనే ప్రశ్నలకు సమాధానాలే దక్షిణ తెలంగాణ ఆర్థిక మార్పు లోతును నిర్ధారిస్తాయి.
కరువు నేలపై జల సిరి..
దక్షిణ తెలంగాణ కథలో మొదటి అధ్యాయం నీటితోనే ప్రారంభమవుతుంది. మహబూబ్‌నగర్ పేరు ఒకప్పుడు కరువు, వర్షాధార వ్యవసాయం, పంటల అనిశ్చితి, ఉపాధి కోసం వలసలతో ముడిపడి ఉండేది. సాగునీటి ప్రాజెక్టులు ఈ పరిస్థితిని మార్చే ప్రయత్నాలకు పునాది వేశాయి. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్‌సాగర్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులు కేవలం నీటి వనరులుగా కాకుండా ప్రాంత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే మౌలిక వసతులుగా మారుతున్నాయి. నీరు అందుబాటులోకి వస్తే పంటల సాగు విస్తరించడమే కాకుండా వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, విత్తనాలు, రవాణా, నిల్వ, మార్కెటింగ్, పశుసంపద వంటి అనుబంధ రంగాల్లోనూ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే సాగునీటి ప్రాజెక్టుల విజయాన్ని కేవలం నీరు చేరిన ప్రాంతంతో కాకుండా.. వాస్తవంగా సాగులోకి వచ్చిన ఆయకట్టు-, పంటల మార్పు, రైతు ఆదాయం వంటి అంశాలతో కొలవాల్సి ఉంటుందన్న సామాజిక నిపుణుల అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక జోక్యంతో, పట్టుదలతో వలసల నేల నుంచి స్థానిక ఉపాధి వైపు మళ్లించేలా నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలవుతోంది. పాలమూరు అభివృద్ధిని కొలిచే మరో కీలక అంశం వలసలు. గతంలో ఉపాధి కోసం హైదరాబాద్, ముంబై, ఇతర రాష్ట్రాల్రు, నగరాలకు పెద్ద సంఖ్యలో కార్మికులు వెళ్లేవారు. ఇప్పుడు స్థానికంగా వ్యవసాయం, పశుసంపద, నిర్మాణ రంగం, చిన్న పరిశ్రమలు, సేవారంగంలో ఎలాంటి అవకాశాలు ఏర్పడ్డాయన్నదే కీలకం. సాగునీరు వ్యవసాయానికి స్థిరత్వాన్ని ఇవ్వగలిగినా.. వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు కూడా పెరగాల్సి ఉంటుంది. స్థానికంగా ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు, ప్రాసెసింగ్ యూనిట్లు-, సేవారంగ కార్యకలాపాలు పెరిగితేనే వలసలపై దీర్ఘకాలిక ప్రభావం కనిపిస్తుంది. అంటే.. గతంలో పాలమూరు నుంచి బయటకు వెళ్లిన శ్రమ ఇప్పుడు పాలమూరులోనే ఆదాయంగా మారే స్థాయికి చేరిందా? అన్నదే అభివృద్ధికి అసలు పరీక్షగా మారుతోంది.
5 జిల్లాలు – 5 ప్రత్యేక ఆర్థిక బలాలు..
దక్షిణ తెలంగాణాలో గరిష్టంగా వెనుకబాటుకు గురైన ఐదు జిల్లాలు.. ఐదు ఆర్థిక బలాలను కలిగి ఉన్నాయి. ఈ జిల్లాలను ఒకే అభివృద్ధి నమూనాతో చూడటం కంటే.. వాటి ప్రత్యేక వనరులను గుర్తించి ప్రత్యేక ఆర్థిక వ్యూహాలు రూపొందించడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఒక్కో జిల్లాలోని సామాజిక ఆర్థిక, స్థితిగతులను పరిశీలిస్తే, మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాంతీయ పట్టణ, వాణిజ్య కేంద్రంగా ఎదుగుతున్న సామర్థంతో పాటు- హైదరాబాద్ సమీపాన్ని లాజిస్టిక్స్, సేవారంగానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే నారాయణపేట జిల్లాలో వ్యవసాయంతో పాటు సంప్రదాయ చేనేత, పశుసంపద, చిన్న వ్యాపారాలకు ప్రత్యేక స్థానం ఉంది. వనపర్తి జిల్లాలో వ్యవసాయం, విద్య, సేవారంగాల విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో కృష్ణా-తుంగభద్ర జలవ్యవస్థ, సాగు, వాణిజ్య అనుసంధానం ఈ జిల్లాకు ప్రత్యేక బలమని స్థానిక పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇక నాగర్‌కర్నూల్ జిల్లా విషయానికొస్తే.. అటవీ, వ్యవసాయ, పశుసంపద వనరులతో పాటు- పర్యాటకం, ఎకోటూరిజం వంటి రంగాలకు అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలను విలువ జోడింపు, మార్కెటింగ్, మౌలిక వసతులతో అనుసంధానం చేయగలిగితే ఐదు జిల్లాలూ ఒకే నమూనాపై ఆధారపడకుండా పరస్పరం అనుసంధానమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చునని ప్రభుత్వం నమ్ముతోంది.
పంట నుంచి విలువ వరకు.. అన్ని అంశాలపైనా అధ్యయనం
సాగు విస్తీర్ణం పెరగడం ఒక ముఖ్యమైన మార్పే. కానీ రైతు ఆదాయం పెరగాలంటే పొలంలో పంట పండించడంతో కథ ముగియకూడదు. పంటకు నిల్వ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా, మార్కెటింగ్ వంటి దశలు జోడించాలి. గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, పశుసంపద ఆధారిత పరిశ్రమలు, విత్తన పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత చిన్న పరిశ్రమలు పెరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత విలువ చేకూరుతుంది. పొలంలో ఉత్పత్తి అయిన ముడి సరుకు బయటకు వెళ్లిపోకుండా.. దాని విలువలో ఎక్కువ భాగం స్థానికంగానే నిలిచేలా వ్యవస్థ ఏర్పడితేనే వ్యవసాయం ఆధారిత అభివృద్ధి మరింత బలపడుతుంది. దక్షిణ తెలంగాణకు రాజధాని హైదరాబాద్ మహానగరం అతి సమీపంలో ఉండడం మరో కీలక ఆర్థిక బలం. మహానగరం విస్తరిస్తున్న కొద్దీ ఆహార సరఫరా, గిడ్డంగులు, లాజిస్టిక్స్, నిర్మాణం, సేవలు, పరిశ్రమలకు చుట్టు-పక్కల ప్రాంతాల్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దక్షిణ తెలంగాణ హైదరాబాద్‌కు కేవలం ముడిసరుకు, కార్మికులను అందించే ప్రాంతంగా కాకుండా.. నగర మార్కెట్‌కు విలువైన ఉత్పత్తులు, సేవలను అందించే ఆర్థిక భాగస్వామిగా ఎదగాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో గడిచిన ఏడాది కాలంగా దక్షిణ తెలంగాణలో మార్పు కనిపిస్తోంది. అయితే, ఆ మార్పు అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో ఉందని చెప్పలేమని వివ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కొన్ని పట్టణాలు వేగంగా విస్తరిస్తుంటే.. మరికొన్ని గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకు సాగునీరు కొత్త అవకాశాలను తెచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాధార వ్యవసాయం, ఉపాధి సమస్యలు కొనసాగుతున్నాయి. అందుకే దక్షిణ తెలంగాణను కేవలం కరువు నుంచి బయటపడిన ప్రాంతంగా చూడటం సరిపోదు. తదుపరి దశలో స్థానిక ఉపాధి, రైతు ఆదాయం, విలువ జోడింపు, పరిశ్రమలు, పట్టణీకరణ అనే ఐదు అంశాల్లో ఎంత పురోగతి సాధిస్తుందన్నదే అసలు ప్రశ్నగా మారింది. పాలమూరు నేలపై సాగునీరు కొత్త అవకాశాలకు తలుపులు తెరిచింది. ఇప్పుడు ఆ అవకాశాలను స్థిరమైన ఆదాయంగా, స్థానిక ఉపాధిగా, పరిశ్రమలుగా మార్చడం దక్షిణ తెలంగాణ ముందున్న తదుపరి సవాలుగా గుర్తించి సీఎం రేవంత్ స్వయం పర్యవేక్షణలో మాస్టర్ ప్లాన్ అమలవుతోంది.
