TG Deputy CM | సింగరేణి కార్మికులకు భట్టి గుడ్‌న్యూస్‌..!

TG Deputy CM | సింగరేణి కార్మికులకు భట్టి గుడ్‌న్యూస్‌..!

15 రోజుల్లో కారుణ్య నియామకాలు పూర్తి
అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు..
‘నెహ్రూ హౌసింగ్‌ కాలనీ’ నిర్మాణం


TG Deputy CM | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సింగరేణి కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. కారుణ్య నియామకాలను 15 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. కార్మికుల ఇళ్ల స్థలాలు, వైద్య సదుపాయాలు, పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై పలు హామీలు ఇచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

సింగరేణిలో ప్రస్తుతం 38,738 మంది శాశ్వత ఉద్యోగులు, 29,715 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కారుణ్య నియామకాలను 15 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. మారుపేర్లకు సంబంధించిన సమస్యకు కూడా అదే గడువులో శాశ్వత పరిష్కారం చూపిస్తామని వెల్లడించారు.

సింగరేణికి చెందిన 1,250 ఎకరాల్లో జీవో 76 ప్రకారం అర్హులైన వారికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే ఆ భూముల్లో నివాసం ఉంటున్న వారిలో అర్హులను గుర్తించి పట్టాలు అందజేస్తామని చెప్పారు. కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేలా ‘నెహ్రూ హౌసింగ్‌ కాలనీ’ పేరుతో గృహ నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు.

మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ పరీక్షల కోసం కార్మికులు కొత్తగూడెం వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఇకపై సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లోనే ఈ పరీక్షలు నిర్వహించే సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. ఏరియా ఆస్పత్రులను కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తామని, సూపర్‌ స్పెషలిస్ట్‌ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

కరోనా సమయంలో విధులకు హాజరుకాకపోవడంతో ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి మరో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. వన్‌టైమ్‌ ఆప్షన్‌ కింద వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా అర్హులైన ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.

సింగరేణి ప్రాంతాల్లో కార్మికులు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం, గృహ వసతి వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.