అప్పులున్న రాష్ట్రంలో సెటిల్‌ సర్వీసుల్లా హెలికాప్టర్ల వినియోగం!

  • ఖజానాపై మోయలేని భారంగా దుబారా వ్యయం
  • పల్లె వెలుగు బస్సుల్లో తిరిగినట్లుగా మంత్రుల టూర్లు
  • ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ప్రజల ఆగ్రహం
  • 50 కిలోమీటర్ల దూరానికీ హెలికాప్టర్‌ ఏంటని ప్రశ్నలు
  • మంత్రులకూ గాలిమోటర్‌ మోజుపై విమర్శల వెల్లువ
  • రాష్ట్రం దివాలా తీసిందంటూనే ఆడంబరాలేంటన్న ప్రశ్నలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో : దుబారా వినియోగంపై రేవంత్‌ సర్కారు అప్రతిష్టను మూటగట్టుకుటోంది. మోయలేని స్థాయిలో ఆర్థిక భారం ఉందంటూ ప్రగల్భాలు చెబుతూనే, అధికారిక పర్యటనల్లో నిధులను నీళ్లలా ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రంలో సెటిల్‌ సర్వీసుల్లా హెలికాప్టర్ల వినియోగం జరుగుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు పోటీ పడుతూ.. శృతిమించిపోతున్న దుబారా వ్యయంతో ఖజానాపై మోయలేని భారం పడుతోంది. పల్లె వెలుగు బస్సుల్లో తిరిగినట్లుగా మంత్రుల టూర్లు జరుగుతున్నాయి. విలాసాలకు పోయి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 నుంచి 100 కిలోమీటర్ల దూరానికీ హెలికాప్టర్‌ వినియోగం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తోంది. మంత్రులకూ గాలిమోటర్‌ మోజుపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రం దివాలా తీసిందంటూనే ఆడంబరాలేంటన్న విమర్శలు సామాన్య ప్రజల వరకూ చేరాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హెలికాప్టర్‌ సదుపాయం ఉంటుంది. గవర్నర్‌, ముఖ్యమంత్రి, కీలక అధికారులు అత్యవసర, దూర, మారుమూల ప్రాంతాల పర్యటనల కోసం ఉపయోగించుకోవచ్చు అనేది ప్రధాన ఉద్దేశం. ఏదైనా విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు హెలికాప్టర్‌ ద్వారా సహాయ బృందాలను రంగంలోకి దింపిన సందర్భాలను గత బీఆర్‌ఎస్‌ పాలనలో చూశాం. కానీ ప్రస్తుతం ప్రభుత్వంలో హెలికాప్టర్‌ వాడకం గమనించి ఇలా కూడా వాడుకోవచ్చా? అని జనం మధ్య చర్చ జరుగుతోంది. మంత్రులు దాన్ని హెలికాప్టర్‌ అనుకుంటు-న్నారా? పల్లెవెలుగు బస్సు అనుకుంటున్నారా? అని ప్రశ్నలు సందిస్తున్నారు. అదే సమయంలో దుబారా ఖర్చులపై సోషల్‌ మీడియాలో సె-టైర్లు పేలుతున్నాయి. ప్రభుత్వం దివాలా తీసిందని ముఖ్యమంత్రి, మంత్రులు సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే, గాలిమోటర్ల ప్రయాణంపై మోజు పెంచుకుంటున్నారని కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

అధికారిక కార్యక్రమాలే అయినప్పటికీ చీటికి, మాటికి వాడడానికి హెలికాప్టర్‌ ఏమైనా షటిల్‌ సర్వీసా? అని రాజకీయ విమర్శలు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యయాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా ‘పల్లె వెలుగు’ బస్సు కంటే అధ్వానంగా తిప్పుతున్న వైనం ఆర్థిక రంగ నిపుణులను, విశ్లేషకులను ఆందోళనకు గురిచేస్తోంది. వీవీఐపీ కేటగిరీలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు బై రోడ్‌ సెక్యూరిటీ- సమస్యలు ఉంటాయి కనుక సహజంగా హెలికాప్టర్‌ వాడటం ఆనవాయితీగా వస్తోంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో షటిల్‌ సర్వీస్‌ను మంచి హెలీకాప్టర్‌ వాడకం జరుగుతోంది. ఖాళీ ఉంటే చాలు.. ఎలా పడితే అలా వాడేస్తున్న సందర్భాలు కోకొల్లలుగా ఉంటున్నాయి. ఆర్మీలో బోలేడు విమానాలు ఖాళీ ఉన్నాయని కేంద్ర మంత్రులు ఇష్టారాజ్యంగా వాడుతున్నారా? అని ప్రజలు నిలదీస్తున్నారు. సరాసరిగా రూ.10 లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రంలో ఇదేం ఆడంబరమని విపక్షాల కన్నా ముందుగానే సామాన్యులు ప్రశ్నించే పరిస్థితులు ఎదురవుతున్నాయి. గ

త ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా చూస్తారని ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటే.. గతం కంటే ఎక్కువ తప్పులు చేస్తున్న వైనం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అత్యవసర సమయంలో వాడటం సహజమే కానీ, చిన్నా, చితక పర్యటనలకు కూడా హెలికాప్టర్‌ వాడకంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు మరింత తీవ్రరూపం దాల్చక ముందే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని, హెలికాప్టర్‌ వాడటానికి నిర్ధేశిత మార్గదర్శకాలు ఇవ్వాలని సామాజికవేత్తలు, రాజీకయ విశ్లేషకులు సూచిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో కాకుండా ఆడంబరాలు, అనవసర వ్యయాలతో ఆర్థిక వ్యయం అదుపు తప్పితే, ప్రజాగ్రహం చవిచూడక తప్పదన్న హెచ్చరికలు కూడా వివవస్తున్నాయి.

విమర్శలు వస్తున్నా, వెనక్కి తగ్గని వైనం

రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు సాగిస్తున్న హెలికాప్టర్‌ ప్రయాణాలపై ప్రతిపక్షాలు అనేక విమర్శలు సంధిస్తున్నన్పటికి వారు మాత్రం హెలికాప్టర్‌ ప్రయాణాలపై వెనక్కి తగ్గడం లేదు. ఓ వైపు అప్పులు అంటూ మరోవైపు పాత హెలికాప్టర్‌ స్థానంలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అత్యాధునిక హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవడాన్ని తాజాగా ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కొత్త హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుంటే నెలకు రూ.5 కోట్లు.. అదే కొనుగోలు చేస్తే రూ.150 నుంచి రూ.160 కోట్లుగా ఉంటుందని అనధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితుతుల్లో ప్రభుత్వ పెద్దలు తరచూ వినియోగిస్తున్న హెలికాప్టర్‌ అద్దెకు తెచ్చారా? లేక కొనుగోలు చేశారా? అన్నదానిపై వివరాలు వెల్లడించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు వాడుతున్న మోడల్‌, అదే కంపెనీ నుంచి హెలికాప్టర్‌ రేవంత్‌ రెడ్డి కూడా కొత్త హెలికాప్టర్‌ను తీసుకున్నట్లు-గా సమాచారం. అయితే, సీఎం రేవంత్‌ రెడ్డి ముచ్చటపడి తెచ్చుకున్న కొత్త హెలికాప్టర్‌ను కూడా మంత్రులు వదలడం లేదని, జిల్లాల పర్యటనకు కొత్త హెలికాప్టర్‌ను కూడా వినియోగిస్తుండటం చర్చనీయాంశం మారింది.

తాజాగా ముఖ్యమంత్రి అనుమతి లేకుండానే కొత్త హెలికాప్టర్‌ను కొందరు సీనియర్‌ మంత్రులు వినియోగిస్తుండడం గమనార్హం. రాష్ట్ర ఖజానాలో డబ్బుల్లేవని సాకు చెప్తూ ఆరు గ్యారెంటీలను రెండున్నరేండ్లుగా రేవంత్‌ సర్కార్‌ ఎగబెడుతూ వస్తున్నది. ఇప్పటికే రూ.4లక్షల కోట్లకు పైగా ప్రభుత్వం అప్పులు చేసింది. ఇది సరిపోదన్నట్టు- మరో భారం నెత్తిన వేసుకుంటోంది. మరో కొత్త హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవాలని రేవంత్‌ సర్కార్‌ యోచిస్తోందన్న విషయం తాజాగా బహిర్గతమైంది. ఇందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

గంటకు పది లక్షలు.. నెలకోసారి చెల్లింపు

సాధారణంగా ప్రభుత్వం హెలికాప్టర్లను కొనదు. కొంటే దాని నిర్వహణ భారంగా మారుతుంది. హెలికాప్టర్‌ పార్కింగ్‌, పైలెట్లు, ఇతర సిబ్బంది నియామకం వంటివన్నీ ఇబ్బంది. అందుకే అవసరాలను బట్టి హెలికాప్లర్లను అద్దెకు తీసుకుంటు-ంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకోబోతున్న హెలికాప్టర్‌కు గంటకు రూ.పది లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంటుది. దేశంలోనే అత్యాధునిక హెలికాప్టర్‌ కావడంతో అద్దె విషయంలో కూడా అత్యధికంగానే వసూలు చేస్తారు. బెంగళూరుకు చెందిన ఓ సంస్థ హెలికాప్టర్లను అద్దెకు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఆ సంస్థతోనే చర్చలు జరుపుతున్నారు. గంటకు రూ.10 లక్షల చొప్పున అద్దె చెల్లించాలని, ఇందుకు అదనంగా జీఎస్టీ సహా పన్నులన్నింటిని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని సదరు సంస్థ నిబంధన పెట్టినట్టుతెలిసింది.

హెలికాప్టర్‌ను ఉపయోగించినా, ఉపయోగించకపోయినా నెల రోజులకు సంబంధించిన అద్దె ముందే చెల్లించాలన్న నిబంధన పెట్టినట్టు సమాచారం. నెలకు రూ.4 కోట్లను కేవలం అద్దె కోసం, నిర్వహణ, పన్నులకు మరో రూ.కోటి కట్టాల్సి ఉంటుది. ఈలెక్కన ఏడాదికి రూ.60 కోట్లు హెలికాప్టర్‌ అద్దె కోసమే ఖర్చు చేస్తోంది. సీఎం ఉపయోగించేందుకు ఎయిర్‌బస్‌ 160 హెలికాప్టర్‌ను తీసుకోవాలని, మంత్రుల కోసం ఇప్పుడు వాడుతున్న పాత హెలికాప్టర్‌ లీజును పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.