conductor| కన్నీటి సంద్రమైన మణుగూరు

కన్నీటి సంద్రమైన మణుగూరు

  • మహిళా కండక్టర్ మృతితో రోడ్డెక్కిన ఆర్టీసీ కార్మికులు
  • న్యాయం కోసం నిరసన ర్యాలీ..
  • ఖమ్మం రీజియన్‌లో నిలిచిన బస్సులు
  • బాధ్యులపై హత్య కేసు నమోదు చేయాలని కార్మికుల డిమాండ్‌..
  • విధుల్లో మహిళా సిబ్బందికి భద్రత కల్పించాలని ఆందోళన

మణుగూరు (రూరల్) నవంబర్ 4 (ఆంధ్రప్రభ) : మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) మృతిని నిరసిస్తూ మణుగూరు డిపో కార్మికులు వందలాది మంది కన్నీటి సంద్రమైన ఆర్తనాదాలు స్థానికులను కదిలించివేసింది. మృతి చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మరణాన్ని తట్టుకోలేని కార్మికులోకం మణుగూరు పట్టణంలో కన్నీటి సంద్రంమై భారీ ర్యాలీ నిరసన వ్యక్తం చేశారు. మృతి చెందిన ప్రవళికు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని నిరసిస్తూ, డిపో దగ్గర నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా సురక్ష బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. చిల్లర వివాదంతో ఓ ప్రయాణికురాలు మహిళా కండక్టర్ ని కదులుతున్న బస్సు నుంచి కిందికి నెట్టివేసిన సంఘటనలో బస్సు కిందపడి తీవ్రంగా గాయపడిన ప్రవళిక మృతి కి కారణమైన అంతకురాలుగా మారిన మహిళా ప్రయాణికురాలిపై హత్య కేసు నమోదు చేసి తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మా ప్రాణాలకు గ్యారెంటీ లేదు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా డిపో వద్ద ఆర్టీసీ సిబ్బంది నిరసన చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఓ చిల్లర గొడవతో పది రోజులు మృతితో పోరాడిన మహిళా కండక్టర్ ప్రవళిక మృతి చెందడం యావత్ ఖమ్మం రీజియన్ కార్మికులు మొత్తం బస్సులు నిలుపుదల చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రవళిక ఫ్లెక్సీతో వందలాది మంది కార్మికులు మణుగూరు పట్టణంలో నినాదాలు చేస్తున్న నిరసన వ్యక్తం చేశారు.

నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు…

మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళికను కదిలే బస్సు నుంచి తోసేసిన మహిళా ప్రయాణికురాలు దురాగతాన్ని నిరసిస్తూ, మణుగూరు ఆర్టీసీ డిపోలో కార్మికులంతా ఐక్యంగా ఏర్పడి బస్సులను నిలుపుదల చేశారు. ప్రవళిక ఆత్మకు శాంతి చేకూర్చాలంటూ కన్నీటి సంద్రమైన కార్మికులు భారీ ర్యాలీ నిరసన వ్యక్తం చేశారు. బస్సు నుండి తోసేసిన మహిళా ప్రయాణికురాలు పై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కార్మికులు డిమాండ్ చేశారు.

క్షణికావేశానికి ఓ నిండు జీవితం ఆవిరి….
చిల్లర ఇచ్చిపుచ్చుకునే వివాదంలో ఓ మహిళ ప్రయాణికురాలు ‌ ‌ క్షణికావేశానికి ఒక్క నిండు జీవితం ఆవిరి అయిపోయింది. పది రోజులు మృత్యుతో పోరాడే ప్రవళిక మరణం చెందడం యావత్తు ఆర్టీసీ కార్మికుల లోకాన్ని కదిలించేసింది. ప్రయాణికుల క్షేమమే మా బాధ్యత అనుకున్నాం. కానీ మా ప్రాణాలకే రక్షణ కరువైందని విధుల్లో ఉన్న సిబ్బందిపై భౌతిక దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కార్మిక సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర గొడవ ఒక పచ్చని కాపురంలో విషాదం నింపి చీకటి లోకంలోనికి నెట్టేసింది.

ప్రవళిక మృతికి ఆర్టీసీ కార్మికులు ఘన నివాళి…..
పది రోజులు మృతితో పోరాడి హైదరాబాదులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచిన ప్రవళిక మృతి కార్మిక లోకాన్ని కలిసివేసింది. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ప్రవళిక అమర్రహే అంటూ వ్యూవాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

కార్మికులు నిరసనతో పోలీసులు భారీ బందోబస్తు……
ఆర్టీసీ కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి కన్నీటి సంద్రమైన మణుగూరు డిపో కార్మికులు భారీగా రోడ్డెక్కి నిరసన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దీంతో మణుగూరు డిఎస్పి రవీంద్రారెడ్డి, సీఐ నాగబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ర్యాలీలు నిరసనలను శాంతియుతంగా కొనసాగే విధంగా భద్రత ఏర్పాటు చేశారు.

ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వం

విధి నిర్వహణలో మృతి చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి కి సంతాప సూచికంగా కార్మికులంతా విధులను బహిష్కరించి,బస్సులను నిలుపుదల చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ మృతు రాలు కుటుంబానికి ఆర్టీసీ తరఫున పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే మృతురాలు తల్లికి ఆర్టీసీలో పర్మినెంట్ ఉద్యోగం ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఆమెకు ఉండేందుకు ఇందిరమ్మ ఇల్లు ప్రకటించారు. అలాగే యూనియన్ బ్యాంక్ నుంచి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా కోటి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా బ్యాంకు ద్వారా అందించేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రకటించారు.

పెళ్లి పీటలు ఎక్కాల్సిన ప్రవళిక, మృత్యు శకటాన్ని ఎక్కింది…

నెల రోజుల్లో పెళ్లి పీటల మీద ఎక్కాల్సిన గుండ్ల ప్రవళిక విధి వక్రీభవించి కాలం కాటేసి మృతి ఒడిలో ఒరిగిపోయింది. ఈ నెలలో కార్తీక మాసంలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ప్రవళిక ఒక్కసారిగా మృత్యువు సకటాన్ని ఎక్కడాన్ని మహిళా కండక్టర్ కన్నీరు మున్నేరుగా విలపించారు. తండ్రి మరణంతో కారుణ్య ఉద్యోగం పొందిన ప్రవళిక ఆరు నెలల్లో ఆమె మృత్యు పీఠాన్ని ఎక్కటం మహిళా కండక్టర్ లోకం జీర్ణించుకోలేకపోయింది. మహిళలకు ఉద్యోగ బాధ్యతలు కూడా రక్షణ లేకుండా పోయిందని, దీనికంతటికి ఆర్టిసి యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రధాన కారణమని మహిళా కండక్టర్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో మహిళలకు ఇవ్వాల్సిన రక్షణ బాధ్యతలు విస్మరించిన యాజమాన్యం అర్ధరాత్రి డ్యూటీలు నిర్వహించాల్సి వస్తుందని వాపోయారు. ఆర్టీసీలో మహిళలకు ఇవ్వవలసిన గౌరవం పని గంటలు అనే విధానం ఆర్టీసీ ఎప్పుడో విస్మరించిందని మహిళా కండక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 8 గంటల దాటితే మహిళా కండక్టర్ డ్యూటీ చేయకూడదని నిబంధనలనున్న, అర్ధరాత్రి వరకు మహిళలతో యాజమాన్యం డ్యూటీలు చేయించుకుని వాళ్ళు భద్రతను గాలికి వదిలేసినట్లు వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం కదిలి మహిళలకు రక్షణ పని విధానంలో మార్పులు తదితర విషయాలపై చర్యలు తీసుకోవాలని మహిళా కండక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.