భారత క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్తోంది. తాజా ICC వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానానికి ఎగబాకాడు. పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ మూడో స్థానానికి జారిపోగా, శుభ్‌మన్ గిల్ మాత్రం అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు.
రోహిత్ (756 పాయింట్లు) ప్రస్తుతం గిల్ (784 పాయింట్లు) కంటే కేవలం 28 పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. గిల్ భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ, వన్డేలోనూ అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ IPL 2025 సీజన్ తరువాత ఎటువంటి పోటీ మ్యాచ్ ఆడకపోయినా, బాబర్‌ను అధిగమించి వన్డే ర్యాంకింగ్స్ రెండో స్థానానికి దూసుకొచ్చాడు. దీంతో బాబర్ మూడో స్థానానికి జారిపోయాడు.
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (736 పాయింట్లు) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా, వన్డేల్లో ఆడాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం భారత జట్టులో ఐదుగురు ఆటగాళ్లు వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-15లో ఉన్నారు. గిల్, రోహిత్, కోహ్లీతో పాటు శ్రేయాస్ అయ్యర్ ఎనిమిదో స్థానంలో, కేఎల్ రాహుల్ 15వ స్థానంలో ఉన్నారు.

