పేద విద్యార్థుల చదువుకు ఉపాధ్యాయుడి ఆర్థిక చేయూత

  • ముగ్గురు విద్యార్థులకు రూ.6,600 సాయం
  • యూనిఫారాలు, స్టడీ మెటీరియల్‌ కోసం ఆర్థిక సహకారం
  • డా. బిగుళ్ల బాబు సేవాభావంపై అభినందనలు

బెజ్జంకి, నవంబర్ 2 (ఆంధ్రప్రభ): విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తూ ఓ ఉపాధ్యాయుడు తన సేవాభావాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న డా. బిగుళ్ల బాబు కొన్నేళ్లుగా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులకు ఆర్థిక చేయూతనందించారు. రోహిత్ వర్మ, గండ్ల కావ్య, భువనేశ్వరి ఒక్కొక్కరికి రూ.2,200 చొప్పున మొత్తం రూ.6,600 అందజేశారు. రెండు జతల యూనిఫారాలు, స్టడీ మెటీరియల్ కొనుగోలుకు ఈ మొత్తాన్ని కేటాయించారు.

కళాశాల ప్రిన్సిపాల్ ఖలీదా షిరీన్, వైస్ ప్రిన్సిపాల్ జె. శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు నగదును అందించారు. పేద విద్యార్థుల చదువుకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న డా. బిగుళ్ల బాబును ఈ సందర్భంగా వారు అభినందించారు.