టీడీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి

వైసీపీ నుంచి 35 కుటుంబాలు టీడీపీలో చేరిక

శావల్యాపురం, ఆంధ్రప్రభ : టీడీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు సూచించారు. గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మండలంలోని గుంటుపాలెం గ్రామానికి చెందిన 35 కుటుంబాలు డాక్టర్‌ అన్నవరపు వీరాంజనేయులు ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. మాజీ సర్పంచ్‌ పచ్చవ శ్రీనివాసరావు, చాగంటి అంజిబాబుతో పాటు మరో 33 కుటుంబాలకు జీవీ ఆంజనేయులు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమానికి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆకర్షితులై పలువురు టీడీపీతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. పార్టీలోకి కొత్తగా చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా పార్టీలో చేరిన కుటుంబాలు మాట్లాడుతూ జీవీ ఆంజనేయులు నాయకత్వంపై నమ్మకంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరుతున్నామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామని, గ్రామంలో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుంటూరు సాంబశివరావు, క్లస్టర్‌ ఇన్‌చార్జి యరమాసు కోటేశ్వరరావు, సొసైటీ చైర్మన్‌ గడిపూడి విశ్వనాథం, నాయకులు చింతా గంగయ్య, బొల్లా పేరయ్య, అన్నవరపు నరేంద్ర, గ్రామ పార్టీ అధ్యక్షుడు దగ్గుపాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.