Nandyala | ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం ఫెయిల్ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

నంద్యాల బ్యూరో, జూన్ 2 (ఆంధ్రప్రభ) : రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నా ఇంతవరకు ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకం అమలు చేయలేదని, ప్రభుత్వం ఫెయిల్ అయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. సోమవారం పట్టణంలోని టేక్కే మార్కెట్ యార్డు నుంచి త‌హ‌సీల్దార్ కార్యాలయం వరకు సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్ ల ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ… రాష్ట్రంలోని పేద ప్రజలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలివ్వాలని, ఇంటి నిర్మాణాలకు ఐదు లక్షల రూపాయలు కేటాయించాలని, సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేవరకు సీపీఐ పార్టీ పోరాటం ఆగదన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ‌ అన్ని మండల కేంద్రాల వద్ద ఇంటి స్థలాలిచ్చి ఇళ్ల నిర్మాణాలకు ఐదు లక్షల రూపాయలు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే వామపక్ష పార్టీలతో పాటు కలిసి వచ్చే అన్ని పార్టీలతో ముందుకు వెళతామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం సెంటు, సెంటున్నర ఇంటి స్థలాలు 30లక్షల మందికి ఇస్తామని చెప్పి ఎవరికీ ఇవ్వలేదని రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్ర క్యాబినెట్ లో తీర్మానం చేసి కూడా నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇవ్వకపోవడం ఏంటని ఆయన నిలదీశారు.

సీఎం మొదటి సంతకం డీఎస్సీ ఫైల్ ఏమైందన్నారు. దాదాపు ఆరు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నార‌న్నారు. తెలంగాణలో మాదిరి రాష్ట్రంలో కూడా రేషన్ షాపుల్లో సన్నబియ్యం వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈసమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకన్న, రాధాకృష్ణ, మురళీధర్ సోమన్న, భార్గవ్, డి.శ్రీనివాసులు, మహిళా నాయకురాలు లక్ష్మీదేవి, సుశీలమ్మ హరినాథ్ సంజీవులు శాఖా కార్యదర్శులు హబీబ్ చాంద్ బాషా, హుస్సేన్సా తో పాటు అర్జీదారులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply