టాక్సీ డ్రైవర్ల సొమ్ముపై ‘సైదా’ కన్ను!

అసోసియేషన్‌ నిధులు, బాడుగ బిల్లులు స్వాహా చేశారని ఆరోపణలు..
రూ.5 లక్షల గోల్‌మాల్‌పై ఎస్పీకి ఫిర్యాదు

గుంటూరు వెస్ట్‌ క్రైమ్‌, ఆంధ్రప్రభ : టాక్సీ డ్రైవర్ల సంక్షేమం కోసం పోగేసిన సొమ్ముపై అసోసియేషన్‌ అధ్యక్షుడి కన్ను పడిందా..? సభ్యుల నుంచి వసూలు చేసిన నగదుతో పాటు ప్రభుత్వ బాడుగలకు సంబంధించిన బిల్లుల సొమ్ము సైతం పక్కదారి పట్టిందా..? సుమారు రూ.5 లక్షల మేర నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపిస్తూ గుంటూరు టాక్సీ డ్రైవర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. 2024లో ఆర్టీఓ అధికారుల సూచనల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు అవసరాలకు టాక్సీలను క్రమబద్ధంగా బాడుగకు నడిపించేందుకు డ్రైవర్లంతా కలిసి అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు బాధితులు తెలిపారు. సభ్యత్వ రుసుము, పార్కింగ్‌ రుసుముతో పాటు వాహనాలను బాడుగకు పంపిన సందర్భాల్లో కొంత మొత్తాన్ని సంఘం నిధిగా జమ చేసేవారమని పేర్కొన్నారు.

సంఘం నిధులను సభ్యుల ఆరోగ్య బీమా, అత్యవసర పరిస్థితులు, కుటుంబ సంక్షేమం కోసం వినియోగించాలనే ఉద్దేశంతో బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన బాడుగలు, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో నడిపిన వాహనాల బిల్లులు, ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు సంబంధించిన బాడుగ బిల్లులు సైతం సంఘం ద్వారా చెల్లించే విధానం ఉండేదని చెప్పారు. అయితే సంఘం అధ్యక్షుడు షేక్‌ ఖాసిం సైదా నిధుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారని సభ్యులు ఆరోపించారు. బాడుగలకు సంబంధించిన బిల్లులను ఫోర్జరీ చేసి, వాటి మొత్తాలను తానే స్వీకరించినట్లు పేర్కొన్నారు. సంఘం ఖాతా నుంచి నగదు డ్రా చేసి దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తూ సుమారు రూ.5 లక్షల మేర నష్టం జరిగిందని తెలిపారు.

లెక్కలు అడిగితే కార్యాలయానికి తాళం

సంఘం నిధులు, బ్యాంకు లావాదేవీలు, బాడుగ బిల్లులకు సంబంధించిన లెక్కలు చూపించాలని అధ్యక్షుడిని కోరగా సమాధానం ఇవ్వకుండా దుర్భాషలాడారని బాధితులు తెలిపారు. ‘‘ఇది నా సొంత కార్యాలయం.. నేను ఏం చేసినా ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారని ఆరోపించారు. సంఘంలో దాచుకున్న సొమ్ము, తమకు రావాల్సిన బాడుగ బిల్లుల డబ్బులు అందకపోవడంతో కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షుడు ఖాసిం సైదా తన పలుకుబడిని ఉపయోగించుకుని పోలీసుల విచారణకు కూడా దూరంగా ఉంటున్నారని ఆరోపించారు. నిధుల లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపి, దుర్వినియోగమైన మొత్తాన్ని తిరిగి ఇప్పించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు.