తాటిపూడి రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్
ఇన్‌ఫ్లో, నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షించాలి
ఎలాంటి పరిస్థితులనైనా సమన్వయంతో ఎదుర్కోవాలి
విజయనగరం/గంట్యాడ, ఆంధ్రప్రభ : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్‌రెడ్డి గురువారం తాటిపూడి రిజర్వాయర్‌ను పరిశీలించారు. రిజర్వాయర్‌లో నీటి నిల్వ, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో పరిస్థితులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. తాటిపూడి రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3.32 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.49 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 297 అడుగులు కాగా, ప్రస్తుతం 279.3 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు వివరించారు.

ప్రస్తుతం రిజర్వాయర్‌కు 2,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, జీవీఎంసీ తాగునీటి అవసరాల కోసం 25 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో రిజర్వాయర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో, నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నీటి ప్రవాహంలో మార్పులు చోటుచేసుకున్న వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
రిజర్వాయర్ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైతే ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి అవసరాలకు అంతరాయం కలగకుండా నీటి సరఫరాను సమన్వయంతో నిర్వహించాలని ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గంట్యాడ తహసీల్దార్ సూర్యకాంతం, ఇరిగేషన్ ఏఈలు హేమకుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
