బేకరి కంపెనీ పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరడా
వరంగల్ క్రైమ్ అక్టోబర్ 25 (ఆంధ్రప్రభ) లాభర్జనే లక్ష్యంగా పెట్టుకొని కాలం చెల్లిన తినుబండారాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చేలాగాటమాడుతున్న బేకరీ షాప్ పై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఎటువంటి లైసెన్సు లేకుండానే వ్యాపారం చేయడమే కాకుండా కాలం చెల్లిన కూల్ కేక్, క్రీమ్ బాటిల్ ఫ్లేవర్స్, కేక్ కలర్స్ విక్రయిస్తున్నట్టు గుర్తించారు. అంతేగాక బేకరీ ఉత్పత్తులపై ఎలాంటి ఎక్స్పైరీ డేట్ లను ముద్రించకుండా విక్రయిస్తున్నట్టు గుర్తించారు. బేకరీ ఉత్పత్తుల పై ప్రజలకున్న మోజు, క్రేజీని అవకాశంగా చేసుకొని అక్రమ దందా చేస్తున్న బేకరి కంపెనీ పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఖిలా వరంగల్ పెట్రోల్ బంక్ సమీపంలోని ఖజూర్ బెంగళూరు బేకరీ ప్రొడక్ట్ కంపెనీలో కాలం చెల్లిన బేకరీ పదార్థాలను గుర్తించారు. 15 రకాల బేకరీ ఉత్పత్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 11 వేల రూపాయల విలువ గల ఉత్పత్తులను పట్టుకొన్నారు.
వరంగల్ మహా నగరంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండ ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్న వ్యాపారస్తుల పై కఠినంగా వ్యవహరించాలని వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల జారీ చేశారు. అందుకనే టాస్క్ ఫోర్స్ ఎ.సి.పి ఎలిగేటి.మధుసూదన్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ బాబులాల్ నేతృత్వంలో దాడి చేశారు. ఖిలావరంగల్ పెట్రోల్ బంక్ సమీపంలో నడుపుతున్న ఖజూర్ బెంగళూరు బేకరి ప్రొడక్ట్స్ కంపెనీలో చట్ట విరుద్ధమైన వ్యాపారం చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు ఆకస్మిక దాడి చేశారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీంతో కల్సి సంయుక్తంగా దాడి చేశారు. పాడైపోయిన వాటిని పారబోయకుండా విక్రయించడానికి సిద్ధంగా ఉన్న బేకరీ ఉత్పత్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. బేకరీ ఓనర్, నిందితుడైన ఎం డి అనీఫ్ (48) ను అదుపులోకి తీసుకొని, విచారణ కోసమై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తికి అప్పగించారు.
వ్యాపారస్తులకు పోలీస్ వార్నింగ్
లాభార్జన కోసమై ఆహార భద్రత నియమాలను ఉల్లంఘిస్తే సహించబోమని వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎలిగేటి మధుసూదన్ హెచ్చరించారు. ప్రభుత్వ నియమావళి మేరకు ప్రభుత్వ లైసెన్సులు పొందకుండా ఎటువంటి వ్యాపారాలు చేయొద్దన్నారు. అపరిశుభ్రంగా, కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారి పై చర్యలు తప్పవన్నారు. ప్రముఖ బ్రాండ్‌ల స్టిక్కర్స్ ను నాసిరకం ఉత్పత్తుల పై అంటించి విక్రయాలు చేసినా సహించబోమన్నారు. నకిలీ వస్తువుల పై నిఘా ఉంచామని కూడా హెచ్చరించారు. గడువు ముగిసిన, పాడై పోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006, 2011 రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం నిబంధనలు పాటించని ఫుడ్ సేఫ్టీ శాఖ సహాయంతో వ్యాపారుల పై చర్యలు తీసుకుంటామని వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎలిగేటి మధుసూదన్ వార్నింగ్ ఇచ్చారు.

