భవిష్యత్‌ కార్యాచరణపై టార్గెట్‌ కమిటీ ఫోకస్‌

  • 2027-28 వార్షిక ప్రణాళికపై సుదీర్ఘ చర్చ
  • ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుపై సమీక్ష

గోదావరిఖని, ఆంధ్రప్రభ: సింగరేణి ఏరియాలోని బొగ్గు గనులు, ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టుల్లో 2027-28 వార్షిక సంవత్సరానికి సంబంధించి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుపై టార్గెట్‌ కమిటీ దృష్టి సారించింది. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కమిటీ పర్యటిస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఉత్పత్తి లక్ష్యాల సాధనకు భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తోంది.

ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయంలో ఆర్జీ-1 ఏరియాపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. రామగుండం ఏరియా జీఎం లలిత్‌కుమార్‌, కార్పొరేట్‌ స్థాయి ఉన్నతాధికారులు దేవేందర్‌, ఎలీషా, యాదయ్య, వి. నరసింహారావు సమక్షంలో సమావేశం కొనసాగింది.

టార్గెట్‌ కమిటీ కన్వీనర్‌ జి. దేవేందర్‌ మాట్లాడుతూ ఆర్జీ-1 ఏరియాలో 2027-28 సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళిక, ఉత్పత్తి లక్ష్యాలు, ఉత్పాదకత పెంపు కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై చర్చించినట్లు తెలిపారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

మ్యాన్‌పవర్‌, మెషినరీ వినియోగం, భవిష్యత్‌ కార్యాచరణ, ఓపెన్‌కాస్ట్‌, అండర్‌గ్రౌండ్‌ గనుల పనితీరు తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఆర్జీ-1 ఏరియాలోని గనులు, ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టులకు సంబంధించిన ఉత్పత్తి వివరాలను, ఆయా ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యలను కమిటీ సభ్యులు తెలుసుకున్నారు.నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అవసరమైన కార్యాచరణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

ఈ సమావేశంలో జీఎం క్వాలిటీ వెంకటరమణ, ఎస్‌వో టు జీఎం చంద్రశేఖర్‌, ఏరియా ఇంజినీర్‌ కాశీ విశ్వేశ్వరరావు, ఏజీఎం ఐఈడీ అంజనేయులు, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ రమేష్‌, ఏజెంట్లు ఎల్‌. రమేష్‌, నెహ్రూ, అన్ని గనుల మేనేజర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.