Tanker Water for Crops పంట కోసం పరుగు.. ట్యాంకర్లతో తడులు!

  • ఎండుతున్న పంటలు.. ట్యాంకర్లే దిక్కు!
  • ఇప్పటికే పెట్టుబడి భారం… పంటను కాపాడుకునేందుకు అదనపు భారం
  • వర్షాలు ముఖం చాటేయడంతో పంటలకు నీటి కటకట
  • సొంత డబ్బులతో ట్యాంకర్ల నీరు తెప్పించుకుంటున్న రైతులు
  • పంటను కాపాడుకోవాలో.. పెట్టుబడిని కాపాడుకోవాలో తెలియని దుస్థితి

Tanker Water for Crops | మేడ్చల్‌, ఆంధ్రప్రభ : ఆకాశం వైపు ఆశగా చూసిన రైతన్నకు నిరాశే మిగిలింది. వర్షాలు ముఖం చాటేయడంతో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు నీరు లేక ఎండిపోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటను కళ్లముందే ఎండిపోనివ్వలేక.. మరోవైపు నీటి కోసం పెరుగుతున్న ఖర్చును భరించలేక మానసికంగా సతమతమవుతున్నారు. చివరకు పంటను కాపాడుకునేందుకు సొంత డబ్బులతో నీటి ట్యాంకర్లను తెప్పించుకుంటున్నారు.

మేడ్చల్‌ మండల పరిధిలోని ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ రావల్‌కోల్‌ పట్టణంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సాగు చేసిన పంటలకు సరిపడా నీరు అందడం లేదు. భూమిని నమ్ముకుని అప్పులు చేసి పంట వేసిన రైతులకు ఇప్పుడు ప్రతి నీటి బొట్టు ఖర్చుతో కూడుకున్నదిగా మారింది.

కళ్లముందే పంట.. చేతుల్లో నీటి ట్యాంకర్‌

పంట పొలంలో పచ్చగా కనిపిస్తున్న మొక్కలు నీరు లేక వాడిపోతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నో రోజుల శ్రమ.. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి.. పంట చేతికొస్తే కుటుంబానికి కొంతైనా ఆదాయం వస్తుందన్న ఆశ.. ఇవన్నీ నీటి కొరతతో ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.

పంటను కాపాడుకోవడానికి వేరే మార్గం లేక రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పొలాలకు అందిస్తున్నారు. ఒకవైపు సాగు పెట్టుబడి.. మరోవైపు ట్యాంకర్ల ఖర్చు.. ఇలా అదనపు భారం తమపై పడుతోందని రైతులు చెబుతున్నారు.

పెట్టుబడి ఒకవైపు.. నీటి ఖర్చు మరోవైపు

‘‘పంట వేసేటప్పుడు మంచి దిగుబడి వస్తుందని ఆశించాం. ఇప్పటికే సాగు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశాం. ఇప్పుడు వర్షాలు లేక పంట ఎండిపోతుంటే చూస్తూ ఉండలేక ట్యాంకర్లతో నీరు పోయిస్తున్నాం. పంటను కాపాడుకోవాలంటే మరోసారి డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది’’ అని స్థానిక రైతులు నరసింహ, భూమయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

పంటకు నీరు అందించేందుకు రోజులు గడిచే కొద్దీ ఖర్చు పెరుగుతోందని వారు తెలిపారు. పంట చేతికి రాకముందే అదనపు పెట్టుబడి పెట్టాల్సి రావడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు.

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

వర్షాలు కురిసి సాగునీటి సమస్య తీరుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్న రైతులకు ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. పంటలు ఎండిపోకుండా తక్షణమే నీటి సదుపాయం కల్పించాలని రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి తమ ప్రాంతంలో నీటి వసతి కల్పించాలని.. ఇప్పటికే సాగులో పెట్టిన పెట్టుబడి వృథా కాకుండా పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లపై ఖర్చు చేస్తున్న అదనపు భారాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.