హైడ్రా జోక్యంతో దిగొచ్చిన ట్యాంకర్ల యజమానులు!

  • సఫలమైన చర్చలు.. ముగిసిన సమ్మె..
  • రెండు రోజులుగా నిలిచిన నీటి సరఫరా పునరుద్ధరణకు నిర్ణయం
  • ఓఆర్‌ఆర్‌ అవతలి ప్రాంతాల నుంచే నీటి సేకరణకు అంగీకారం
  • హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌తో చర్చలు సఫలం
  • సంబంధిత శాఖల అనుమతులతోనే బోరు నీటి సేకరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :

హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కొనసాగుతున్న నీటి ట్యాంకర్ల సమ్మె ముగిసింది. తక్షణమే నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు ట్యాంకర్ల యజమానులు అంగీకరించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) అవతలి ప్రాంతాల నుంచి నీటిని సేకరించి నగరానికి సరఫరా చేసేందుకు సమ్మతి తెలిపారు. బుధవారం హైడ్రా కార్యాలయంలో కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌తో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచన మేరకు వాటర్‌ ట్యాంకర్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌ నేతృత్వంలోని ప్రతినిధులు కమిషనర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. చర్చల అనంతరం కమిషనర్‌ సూచనల మేరకు సమ్మె విరమించాలని నిర్ణయించారు. తక్షణమే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు అంగీకరించారు.

ప్యూర్‌ ప్రాంతం నుంచే నీటి సేకరణ

సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత ప్యూర్‌ (పెరి అర్బన్‌ రీజియన్‌) ప్రాంతం నుంచి బోరు నీటిని సేకరించి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సంఘం సభ్యులు అంగీకరించారు. ఇకపై తమ ట్యాంకర్‌ వ్యాపార కార్యకలాపాలను ప్యూర్‌ ప్రాంతం నుంచే నిర్వహిస్తామని యజమానులు తెలిపారు.

హైదరాబాద్‌ నగరంలో జనసాంద్రత అధికంగా ఉండటంతో పాటు ఎల్‌నినో ప్రభావం, తగినంత వర్షపాతం లేకపోవడం వంటి కారణాలతో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయని కమిషనర్‌ వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలోని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాణిజ్య అవసరాల కోసం పెద్ద ఎత్తున భూగర్భ జలాలను తోడటం వల్ల స్థానికుల గృహ అవసరాలకు ఉపయోగించే బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు.

మాదాపూర్‌, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, అమీర్‌పేట, అశోక్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో నీటికి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ట్యాంకర్ల నిర్వాహకులు రవాణా దూరం, ఇంధన ఖర్చులను తగ్గించుకునేందుకు ఆయా ప్రాంతాలకు సమీపంలోని బోర్ల నుంచి నీటిని సేకరిస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోందన్నారు. సాధారణంగా గృహ అవసరాల కోసం 100 నుంచి 300 అడుగుల లోతులో బోర్లు వేస్తుండగా, వాణిజ్య అవసరాల కోసం కొందరు 1,000 నుంచి 1,500 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ లోతులో బోర్లు వేసి, అధిక సామర్థ్యం కలిగిన మోటార్లతో నీటిని తోడుతున్నారని వివరించారు. ఈ విధానం భూగర్భ జలాలపై మరింత ప్రభావం చూపుతోందని తెలిపారు.

స్థానికుల ఫిర్యాదులతో చర్యలు

ఈ సమస్యపై పలు కాలనీల సంక్షేమ సంఘాలు, స్థానిక ప్రజల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. తెల్లాపూర్‌లో వాణిజ్య అవసరాల కోసం నీటిని తోడటాన్ని నిలిపివేయాలని స్థానికులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. సూరారం, జీడిమెట్ల ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లలోని బోర్లలో నీరు అడుగంటిపోతోందని హైడ్రా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా.. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌, భూగర్భ జలాల శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టింది. చెరువుల నుంచి వాణిజ్య అవసరాల కోసం నీటిని తోడుతున్న బోర్లను గుర్తించి తొలగించే చర్యలూ చేపట్టింది. నగరంలోని జనసాంద్రత అధికంగా ఉండి, నీటి డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాణిజ్య అవసరాలకు భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించేందుకు వాటర్‌ బోర్డు, రెవెన్యూ, పోలీసు తదితర శాఖలతో కలిసి పనిచేస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు.

అదే సమయంలో వాణిజ్య సంస్థలకు నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటూనే, ప్రజల గృహ అవసరాలకు నీటి లభ్యతను కాపాడేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.