మాటకారి.! మాయలోడు.!..

మాటకారి.! మాయలోడు.!..

బడా భూస్వామి పైగా ఓ పోలీసు అధికారి అండదండలు.!
పోలీసుల పేరు చెప్పి వసూళ్లు.!
జిల్లా పోలీసుల చుట్టూ తిరుగుతున్న ప్రబుద్ధుడు.!
ప్రతి పంచాయతీలో వేల కొద్ది డిపాజిట్లు..
ఇరువురి మధ్యలో తగాదాలు పెట్టించడంలో తనకు తానే దిట్ట..
రేండ్లగూడ నుంచి మండల స్థాయిలో పంచాయతీలు.!
అల్లం వారి కుంటను ఆక్రమించుకున్న ఘనుడే ఈ ప్రబుద్ధుడు..!

నిఘావిభాగం, ఆంధ్రప్రభ: మాటకారి మాయలోడు.! ఆయనో బడా భూస్వామి. ఆయన సామాజిక వర్గానికి చెందిన జిల్లాస్థాయి పోలీసు అధికారి పేరు చెబుతూ పైరవీలు చేస్తూ, ఇరువురి మధ్యలో ఉన్న చిన్న తగాదాలు పసిగట్టి పెద్దగా చేస్తూ పంచాయతీలు సృష్టిస్తూ పెద్ద మొత్తంలో డిపాజిట్లు పెట్టిస్తూ పోలీసుల పేర్లు చెబుతూ వసూళ్లకు పాల్పడుతూ అల్లం వారి కుంటను ఆక్రమించుకున్న భూస్వామే ఆ మాటకారి మాయల ఘనుడు.! పూర్తి వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామానికి చెందిన అల్లం వారి కుంటను ఆక్రమించుకున్న బడా భూస్వామి. ఆ భూస్వామి ఆగడాలు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయి. ఆ భూస్వామి ఆగడాల చిట్టంతా “ఆంధ్రప్రభ” చేతిలో ఆధారాలతో ఉన్నాయి.

గతంలో ఆ జిల్లా స్థాయి పోలీస్ అధికారి ఆ భూస్వామి కుమారుని పెళ్లి రిసెప్షన్ కు రేండ్లగూడకు వచ్చారు. ఆ భూస్వామికి దగ్గరి బంధువైన అదే సామాజిక వర్గానికి చెందిన ఓ జిల్లా స్థాయి పోలీస్ అధికారి అండదండలతో పోలీసుల పేర్లు చెప్పి డబ్బులు వసూళ్లు చేసిన ఘటనలు కో..కొళ్లలు.! తాజాగా మండలంలోని పొనకల్ వాసవి నగర్ కు చెందిన ఇరువురి భూ తగాదాలో ఓ పక్షాన ఆ భూస్వామి నిలిచి రూ.3 లక్షల డబ్బులు గుత్తగా మాట్లాడుకుని జిల్లాలో పోలీసుల చుట్టూ తిరుగుతూ” కథ” నడిపిస్తున్నాడు.

గతంలో మండలంలోని తొమ్మిది గుడిసెలపల్లికి చెందిన ఆ భూస్వామి సామాజిక వర్గానికి చెందిన ఓ పంచాయతీలో పోలీసుల పేరు చెప్పి రూ.5 లక్షలు గుత్తగా మాట్లాడుకొని ఆ మాటకారి భూస్వామి రూ.3 లక్షలు ఆయనే ఉంచుకొని, మిగతా రూ.2 లక్షల డబ్బులను ఆ పంచాయతీకి వచ్చిన పెద్ద మనుషులందకీ వాటాలుగా పంచినట్లు బోగట్టా.

రేండ్లగూడ గ్రామ యాదవ సామాజిక వర్గానికి చెందిన మల్లన్న దేవుని పేరు గల వ్యక్తిని ఓ సమస్యలో ఇరికించి ఇబ్బందులు పెట్టినట్లు ఆ వ్యక్తి విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మాటకారి భూస్వామి నిత్యం సాయంత్రం మద్యం విందులో జల్సాలు చేస్తాడు.ఇవి మచ్చుకే కొన్ని అయినా.! ఇంకా చాలా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా గ్రామానికి చెందిన అల్లం వారి కుంటను పథకం ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో ఉన్న లోసుగులను ఆసరాగా చేసుకుని 24 ఎకరాలు ఉన్న కుంటను కేవలం మూడెకరాలకే పరిమితం చేశాడు మాటకారి భూస్వామి. ఈ వ్యవహారాల్లో పోలీసులు ఆచితూచి పసిగట్టి వ్యవహరిస్తూ ఆ మాటకారి భూస్వామిని పక్కకు పెడతారో ?,మచ్చ తెంచుకుంటారో..? వేచి చూడాలి..!