మురుగు నీరు తాగుతూ.. ప్రజలు రోగాల బారిన పడుతున్నా పట్టింపులేదా?
- నల్లగుట్టలో కలుషిత నీరు, డ్రైనేజీ సమస్యలపై తలసాని ఆగ్రహం
- 15 రోజుల్లో సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం
- ప్రత్యేక సిబ్బందిని నియమించి చెత్త తొలగించాలని సూచన
- వారానికి ఒకసారి బస్తీలో పర్యటించి డ్రైనేజీ లీకేజీలను పర్యవేక్షించాలని ఆదేశం
సనత్ నగర్, ఆంధ్రప్రభ: మురుగు నీరు తాగుతూ, అపరిశుభ్ర వాతావరణంలో ప్రజలు రోగాల బారిన పడుతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సోమవారం ఆయన రాంగోపాల్‌పేట డివిజన్లోని నల్లగుట్ట, జే లైన్, ఎఫ్ లైన్ ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు.
ముందుగా నల్లగుట్ట అభివృద్ధి సంఘం హాల్ వద్ద నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. బస్తీలోని ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాటర్ ట్యాంక్‌తో పాటు బోరును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అనంతరం నల్లగుట్టలోని ఎఫ్ లైన్, జే లైన్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తుండటాన్ని చూసి ఒకింత అసహనానికి గురైన తలసాని అధికారులను ప్రశ్నించారు. గత మూడు నెలలుగా కలుషిత తాగునీరు సరఫరా అవుతోందని, ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఎమ్మెల్యే ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు.

15 రోజుల్లో పరిష్కరించాలి..
సుమారు వెయ్యి కుటుంబాలు నివసించే నల్లగుట్ట ప్రాంతంలోని ప్రజల ఫిర్యాదులపై అధికారులు ఎందుకు స్పందించడం లేదని తలసాని ప్రశ్నించారు. ప్రజలు మురుగునీరు తాగి రోగాల బారిన పడాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తీల్లో నివసించే ప్రజలు అనారోగ్యానికి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు.
నల్లగుట్టలోని అన్ని ప్రాంతాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి కలుషిత నీటి సమస్యతో పాటు డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి 15 రోజుల్లోగా ప్రతిపాదనలు అందజేయాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. నూతన పైప్లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మరమ్మతులు చేపట్టి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ఎఫ్ లైన్ కమిటీ హాల్‌ను సందర్శించిన తలసాని, పరిసర ప్రాంతాలతో పాటు హాల్ ఆవరణలో పెద్దఎత్తున చెత్త పేరుకుపోయి ఉండటాన్ని గమనించారు. పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని పారిశుద్ధ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ప్రజలు ఎలా జీవించగలరని ప్రశ్నించారు.
తమ వద్ద సరిపడా సిబ్బంది లేరని సంబంధిత అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో తలసాని వెంటనే పారిశుద్ధ్య విభాగానికి చెందిన ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి నల్లగుట్టలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. తక్షణమే ప్రత్యేక సిబ్బందిని నియమించి నల్లగుట్ట ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సీఎం తీరుపై తలసాని ఫైర్
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి పాలనను పక్కన పెట్టి ప్రతిపక్షాలపై బూతులు మాట్లాడటంపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ నగరంలోని సమస్యలపై ఆయనకు అవగాహన లేదని, నగర సమస్యలపై ఒక్కసారైనా సమీక్ష నిర్వహించారా? అని ప్రశ్నించారు.
కమిటీ హాల్లో అవసరమైన అభివృద్ధి పనులను పూర్తి చేసి బస్తీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారానికి ఒకసారి తప్పకుండా బస్తీలో పర్యటిస్తూ డ్రైనేజీ లీకేజీలు లేకుండా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. నల్లగుట్టలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, నూతన పైప్లైన్లు, అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్, ఎలక్ట్రికల్ ఏడీఈ దుర్గా ప్రసాద్, ఏఈ శివ రామకృష్ణ, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, శ్రీహరి, కోటేశ్వర్ గౌడ్, ఆంజనేయులు, టీనా గౌడ్, జనార్దన్, అరుణ్ భట్, బస్తీవాసులు సత్యనారాయణ, మిట్టు, నరేష్, గంగరాజు, సురేష్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
