- స్వచ్ఛ చల్లపల్లి గ్రామాలు ఇంకా రావాలి
- రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య
ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి : స్వచ్ఛ చల్లపల్లిని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య తెలిపారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాలు చేపట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన చల్లపల్లి గ్రామంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. గ్రామంలోని రహదారుల వెంబడి గ్రీనరీ, దాతల సహకారంతో గ్రామాభివృద్ధిలో చేపట్టిన పలు కార్యక్రమాలను కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో కలిసి పరిశీలించి స్వచ్ఛ చల్లపల్లి రథ సారథులు డా.డి.ఆర్.కె.ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతి, స్వచ్ఛ కార్యకర్తలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్వచ్ఛ గ్రామాలు ఇంకా రావాలని, యువత భాగస్వామ్యం కావాలని, మంచి పనులు పది మందికి చెప్పాలని తెలిపారు. దాతల సహకారం తీస లకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకు వెంటున్నారని వివరించారు. పవన్ కళ్యాణ్ గ్రామాలు సందర్శిస్తే స్వచ్ఛ చల్లపల్లికి మరింత ప్రాచుర్యం కలుగుతుందన్నారు.

చల్లపల్లి గ్రామంలో ఎన్టీఆర్ పార్కును సందర్శించి పారిశుధ్య కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని ఐ ఆర్ సి ఎస్ చైర్మన్, స్వచ్ఛ సుందరపల్లి చల్లపల్లి రూపకర్త డాక్టర్ బి.ఆర్.కె ప్రసాద్ వారి సతీమణి డాక్టర్ పద్మావతి లను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో హిందువుల స్మశాన వాటికను, డంపింగ్ యార్డ్ ను సుందరంగా అభివృద్ధి పరిచామన్నారు. ఇంట్లో చెత్త వీధిలో వేయకుండా ప్రతి ఒక్కరు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి పంచాయతీ వారికి అందించేలా కృషి చేశామన్నారు. తడి చెత్తను సాధ్యమైనంత వరకు కాంపోస్టు ఎరువుగా తయారు చేస్తున్నామన్నారు. పొడి చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ చేయాలని ప్రధాన ఉద్దేశంతో కృషి చేస్తున్నామన్నారు. తదనంతరం స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి ఒక్క ఉద్యోగి తనకు ఇంక్రిమెంట్ వచ్చిన, పదోన్నతి వచ్చిన ఒక మొక్కను నాటాలని, ప్రజలందరూ స్వచ్ఛమైన గాలి పీల్చేందుకు మొక్కలను విరివిగా నాటాలని పిలుపునిస్తూ ఒక పాటను ఎంతగానో ఆకట్టుకునే విధంగా పాడడంతో చైర్మన్ చాలా బాగుందని అభినందించారు. తదుపరి చైర్మన్ చల్లపల్లి గ్రామంలోని సుందరంగా తీర్చి దిద్దిన స్మశాన వాటికను పరిశీలించి ఆశ్చర్య చకితులయ్యారు. తదుపరి వారు చెత్త నుంచి సంపద కేంద్రం కంపోస్ట్ యార్డును పరిశీలించారు

తదనంతరం మండలి చైర్మన్ చల్లపల్లి నారాయణరావు నగర్ కాలనీలోని ముస్లిం స్మశానంలో డాక్టర్ పద్మావతి ఆర్థిక సహాయం రూ.11.50 లక్షలతో నిర్మించిన ముఖ ద్వారం, జనాజా నమాజ్ షెడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి స్వచ్ఛత కార్యక్రమాలను మరింత ముమ్మరంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు.గ్రామంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏవి గురునాథరెడ్డి 2 లక్షల రూపాయలు డాక్టర్ కాలేషావల్లి లక్ష రూపాయలు సుందర చల్లపల్లికి విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర స్వచాంద్ర మిషన్ డైరెక్టర్ బోలెం నాగమణి, చల్లపల్లి గ్రామ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, డిప్యూటీ సీఈఓ ఆనందకుమార్, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీరు శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మాధవేంద్రరావు, పలువురు స్వచ్ఛ సుందరపల్లి చల్లపల్లి కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.


