World Heart Day | చూసుకో పదిలంగా… హృదయాన్ని అద్దంలా..!
World Heart Day | చూసుకో పదిలంగా… హృదయాన్ని అద్దంలా..!
- మన ‘గుండె’ చప్పుడును కాపాడుకుందాం
- నవతరాన్ని వణికిస్తున్న గుండెపోటు భయాలు
- జీవనశైలి, శారీరక శ్రమ రాహిత్యం, మానసిక ఒత్తిళ్లే ప్రధాన శత్రువులు
- నిత్యం వ్యాయామం, సమతుల ఆహారంతో హృదయానికి రక్షణ కవచం
- ముందస్తు సంకేతాలను గుర్తించి.. తగిన జాగ్రత్తలు పాటిస్తే నిండు నూరేళ్ల ఆయుష్షు
- రేపు ‘ప్రపంచ హృదయ దినోత్సవం’..
World Heart Day | (క్వాలిటీసెల్ డెస్క్, ఆంధ్రప్రభ) : ఒకప్పుడు అరవై ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే పరిమితమనుకున్న ‘గుండెపోటు’.. నేడు పాతికేళ్ల యువతనూ ఉలిక్కిపడేలా చేస్తోంది. జిమ్‌లో కసరత్తులు చేస్తూ, సరదాగా డాన్స్ చేస్తూ, ఆడుతూ పాడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. విశ్వవ్యాప్తంగా సంభవిస్తున్న మొత్తం మరణాల్లో అత్యధిక శాతానికి హృద్రోగాలే ప్రధాన కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యం పట్ల ప్రజల్లో చైతన్యం నింపేందుకు, ముందస్తు జాగ్రత్తల ప్రాధాన్యాన్ని చాటేందుకు ప్రతి ఏటా సెప్టెంబరు 29న ‘ప్రపంచ హృదయ దినోత్సవం’ (World Heart Day) నిర్వహిస్తున్నారు.
యువతపై హృద్రోగ దాడి… కారణాలేంటి..?
భారతదేశంలో రెండు దశాబ్దాలుగా గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక పరిశోధన ప్రకారం ముఖ్యంగా 30 నుండి 40 ఏళ్ల మధ్య వయస్కులలో గుండెపోటు మరణాలు పెరగడానికి ప్రధాన కారణాలు…
-తీవ్రమైన మానసిక ఒత్తిడి : ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత జీవితాల్లో నిరంతరం ఎదురయ్యే ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు ఎక్కువగా విడుదలై రక్తం గడ్డకట్టే అవకాశాన్ని పెంచుతాయి.
-అస్తవ్యస్తమైన నిద్ర : రాత్రివేళల్లో ఆలస్యంగా పడుకోవడం, సరిపడా నిద్ర (కనీసం 7-8 గంటలు) లేకపోవడం వల్ల రక్తపోటు పెరిగి గుండెపై భారం పడుతుంది.
-జంక్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఆహారం: అధిక ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రాసెస్ చేసిన నూనెలు, కూల్ డ్రింక్స్, మైదాతో చేసిన పదార్థాలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయి.
-శారీరక శ్రమ లేకపోవడం: నిరంతరం కంప్యూటర్ల ముందు కూర్చోవడం, కనీస నడక లేకపోవడం వల్ల చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం బారిన పడుతున్నారు.
-ధూమపానం అండ్ మధ్యపానం: స్మోకింగ్ చేయడం వల్ల ఆర్టరీలలో తీవ్రమైన మంట (Inflammation) ఏర్పడి రక్తనాళాలు కుంచించుకుపోతాయి.
ముందస్తు హెచ్చరిక సంకేతాలు …
గుండెపోటు అకస్మాత్తుగా వచ్చినట్లు అనిపించినా, శరీరం కొన్ని రోజుల ముందు నుంచే కొన్ని సూచనలు ఇస్తుంది. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు:
-చాతి మధ్యలో తీవ్రమైన పిండినట్లుండే నొప్పి, భారం లేదా అసౌకర్యం.
-ఆ నొప్పి ఎడమ చేయి, గొంతు, దవడ, వెన్ను భాగం లేదా కడుపు వైపు ప్రాకడం.
-కనీస శ్రమ లేకుండానే విపరీతంగా చెమటలు పట్టడం.
-ఆయాసం, ఊపిరి అందకపోవడం, తలతిరగడం.
-అజీర్తి లేదా తీవ్రమైన గ్యాస్ సమస్యగా అనిపించడం (చాలామంది దీనిని గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి పొరబడతారు).
గుండెను పదిలంగా ఉంచుకునే కొన్నిసువర్ణ సూత్రాలను విధిగా పాటించాలి.. అప్పుడే గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు.
- రోజువారీ వ్యాయామం ప్రతిరోజూ కనీసం 30-45 నిమిషాల వేగవంతమైన నడక (Brisk Walk) లేదా ఈత, సైక్లింగ్.
- ఆరోగ్యకరమైన ఆహారంపండ్లు, ఆకుకూరలు, నట్స్ (బాదం, వాల్‌నట్స్), తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, నూనెలు తగ్గించాలి.
- క్రమబద్ధమైన పరీక్షలు30 ఏళ్లు దాటిన వారు ఏడాదికి ఒకసారి BP, Sugars, Lipid Profile పరీక్షలు చేయించుకోవాలి.
- వ్యసనాలకు దూరంగా ఉండాలి… ధూమపానం (Smoking) పూర్తిగా మానాలి, మద్యం పరిమితి దాటకూడదు.
- ఒత్తిడి నిర్వహణ కోసం.. యోగా, ధ్యానం (Meditation), కుటుంబంతో సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతత పొండాలి.
చివరగా..
గుండె అనేది నిరంతరం శ్రమించే అద్భుతమైన యంత్రం. దాని ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇవాళ్టి నుంచే జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుందాం.. మన గుండెను, మన కుటుంబాన్ని పదిలంగా కాపాడుకుందాం!
