వన్యప్రాణుల రక్షణకు ప్రత్యేక చర్యలు
తాడ్వాయి, ఆంధ్రప్రభ : వన్యప్రాణుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎఫ్డీఓ వజ్రరెడ్డి తెలిపారు. వన్యప్రాణి వారోత్సవాలను అక్టోబర్ 2 నుంచి 8 వరకు తాడ్వాయి డివిజన్లో ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. వారం రోజుల పాటు తాడ్వాయి డివిజన్‌కు చెందిన అటవీ శాఖ సిబ్బంది వివిధ అవగాహన, సంరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజలు, పాఠశాల విద్యార్థులకు వన్యప్రాణులు, అటవీ సంరక్షణపై అవగాహన కల్పించారు. వారోత్సవాల తొలిరోజు ప్రజలు, అటవీ శాఖ సిబ్బంది, విద్యార్థుల భాగస్వామ్యంతో ర్యాలీ నిర్వహించి వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
కొడిశాల గుత్తికోయ హ్యాబిటేషన్‌లో నివసిస్తున్న గుత్తికోయ ప్రజలు, కొడిశాల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అటవీ ప్రాముఖ్యత, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. వన్యప్రాణులను వేటాడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరించారు. ఎవరైనా వన్యప్రాణులను వేటాడుతున్నట్లు తెలిసినప్పుడు ఆ సమాచారాన్ని అటవీ శాఖ సిబ్బందికి తెలియజేయాల్సిన విధానాన్ని వివరించారు. అటవీ జంతువులు పర్యావరణ సమతుల్యతలో పోషించే ముఖ్యమైన పాత్ర, అటవీ ప్రాంతాల ప్రాధాన్యత, మానవ జీవనంపై అడవుల ప్రభావం, వాతావరణ పరిరక్షణలో అడవుల పాత్ర వంటి అంశాలను విద్యార్థులు, గుత్తికోయ ప్రజలకు వివరించారు.
బందాల, లింగాల, పస్రా గ్రామాల సర్పంచ్‌లను కార్యక్రమానికి ఆహ్వానించి లింగాల, తాడ్వాయి రేంజ్ సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతంలో వనదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లకు అటవీ, వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యత, ఇప్పటివరకు చేపట్టిన అటవీ సంరక్షణ కార్యక్రమాలు, భవిష్యత్తులో గ్రామస్థాయిలో చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, గ్రామస్థాయిలో అటవీ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓలు శ్రీనివాస్, శ్రావన్, సర్పంచ్‌లు మంకిడి శ్రీలత, మొగుళ్లపల్లి రవీందర్, ఎఫ్‌బీఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
