లేసు ట్రేడ్‌ సెంటర్‌లో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

నరసాపురం, ఆంధ్రప్రభ: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నరసాపురం అంతర్జాతీయ లేస్‌ ట్రేడ్‌ సెంటర్‌లో శుక్రవారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హస్తకళల ఎగుమతి ప్రోత్సాహక మండలి (ఈపీసీహెచ్‌), ఇండియా–ఐఎల్‌టీసీ కన్వీనర్‌ కలవకొలను నాగతులసీరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

స్వచ్ఛ భారత్‌ సేవా కార్యక్రమంలో భాగంగా లేస్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఆవరణలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నాగతులసీరావు కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. కార్యాలయ ఆవరణతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

సబ్‌ కమిటీ సభ్యులు అడ్డగళ్ల బాబా, కలవకొలను రాజీవ్‌ చంద్ర, లేస్‌ ఎగుమతిదారు తండాల నటేష్‌, నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్‌ పోలిశెట్టి పుష్పనళిని, అంతర్జాతీయ లేస్‌ ట్రేడ్‌ సెంటర్‌ సిబ్బంది, 20 మంది లేస్‌ మహిళలు కలిసి పరిసరాలను శుభ్రం చేశారు.

అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 80 మంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు.