రాప్తాడు పీహెచ్‌సీకి స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు
రాప్తాడు,ఆంధ్రప్రభ: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ఇనిషియేటివ్ (ఎస్ఏఎస్ఏ)లో భాగంగా నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డ్స్‌లో రాప్తాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికైంది. స్వచ్ఛ ఆసుపత్రి కేటగిరీలో అవార్డు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శివకృష్ణ తెలిపారు.
స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రశంసనీయమైన సేవలు అందించినందుకు రాప్తాడు పీహెచ్‌సీకి ఈ గుర్తింపు లభించింది. శుక్రవారం అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ శివకృష్ణ జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ దాలవాయి రమాదేవి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
పీహెచ్సీలో స్వచ్ఛత, పరిశుభ్రత, పరిసరాల నిర్వహణతో పాటు ఇతర కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఈ అవార్డు లభించినట్లు అధికారులు తెలిపారు. రాప్తాడు పీహెచ్‌సీకి స్వచ్ఛ ఆసుపత్రిగా జిల్లా స్థాయి గుర్తింపు రావడంతో వైద్య సిబ్బంది, గర్భిణులు, బాలింతలు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ శివకృష్ణను అభినందించారు.
