కారుమంచికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు
శావల్యాపురం, ఆంధ్రప్రభ: గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జిల్లా కేంద్రమైన నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్ నందు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ అవార్డుల ప్రధానంలో మండలంలోని కారుమంచి గ్రామానికి జిల్లా స్థాయిలో స్వచ్ఛంధ్ర అవార్డు లభించింది.
గ్రామంలో పారిశుధ్యంతోపాటు, పరిసరాల పరిశుభ్రత, చెత్త సంపద కేంద్రంలో సేంద్రియ ఎరువుల తయారీ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని గ్రామానికి ఈ అవార్డును అందజేశారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు చేతుల మీదుగా కారుమంచి పంచాయతీ కార్యదర్శి జోష్ణారాణి ప్రశంసాపత్రాన్ని, అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సీతారామయ్య పంచాయతీ కార్యదర్శిని అభినందించారు.
