- ఎస్వీయూ పీజీ విద్యార్థి అర్దనగ్న ప్రదర్శన..
తిరుపతి రూరల్ , ఆంధ్రప్రభ : ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కానందున పేద , మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు తాము చదివిన కాలేజీల నుంచి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ మార్క్ మెమోలు, ఇతర అవసరమైన సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు.
తాజాగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో చోటుచేసుకున్న ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. 2024-25 లో పీజీ పూర్తి చేసి, బీఎడ్ చదవాలని భావించిన విద్యార్థి వినోద్ కుమార్ తన టీసీ కోసం కళాశాలకు వచ్చాడు.
అయితే, ఫీజు బకాయి ఉందని కాలేజీ అధికారులు టీసీ ఇవ్వలేదు. ఇందుకు నిరసనగా ఆ విద్యార్థి అర్ధనగ్నంగా ప్రిన్సిపాల్ కార్యాలయంలో కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు రోజు కూలీ పనులు చేసుకుని తనను చదించారని, ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తుందనే దీమాతో కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ చదివానని, కళాశాలలో చేరేటప్పుడు కూడా అలాట్ మెంట్ కాపీలో ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుందని అప్పటి అధికారులు తెలిపారని అన్నారు.
తీరా చూస్తే ప్రభుత్వం ఇవ్వలేదని కారణం చూపి విద్యార్థుల దగ్గర ముక్కు పిండి ఫీజు వసూలు చేస్తున్నారని వాపోయాడు. విద్యార్థులకు , సర్టిఫికెట్లు ఆపకూడదని అన్ని యూనివర్సిటీలకు, కాలేజీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని యెడల వేలమంది విద్యార్థులతో కలిసి ఎంఎల్ఏ, మినిస్టర్ ల ఇళ్లు ముట్టడిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు

