గ్రానైట్ క్వారీలో వాచ్‌మెన్ అనుమానాస్పద మృతి
రేకుల షెడ్‌లో లభ్యమైన లక్ష్మీనారాయణ మృతదేహం
కేసముద్రం, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బెరువాడ సమీపంలోని కాకతీయ గ్రానైట్ క్వారీలో వాచ్‌మెన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. క్వారీలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న దారం లక్ష్మీనారాయణ (60) మృతదేహం క్వారీలోని ఓ రేకుల షెడ్‌లో లభ్యమైంది. విధుల్లో ఉన్న సమయంలోనే మృతి చెందడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. పోలీసుల విచారణ అనంతరం మృతికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
