వ్యక్తి అనుమానాస్పద మృతి

ఏలూరు రూరల్‌, ఆంధ్రప్రభ: ఏలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం వెలుగుచూసింది. గుండుగొలను ప్రాంతానికి చెందిన చిన్ని దుర్గారావు (25) స్థానికంగా చేపల చెరువుల వద్ద పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

బుధవారం ఉదయం ఆర్టీవో కార్యాలయం సమీపంలో దుర్గారావు మృతిచెంది పడి ఉన్నట్లు సమాచారం అందడంతో రూరల్‌ ఎస్సై వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, పరిసర ప్రాంతాల్లో వివరాలు సేకరించారు.

ప్రాథమికంగా అనారోగ్య కారణాలతో దుర్గారావు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు.

పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి అసలు కారణం వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.