పల్నాడు జిల్లాలో ఇద్దరు మావోయిస్టుల లొంగిపోబాటు..
ఆంధ్రప్రభ, నరసరావుపేట క్రైం : మావోయిస్టు ఉద్యమానికి చెందిన ఇద్దరు సీనియర్ క్యాడర్లు హింసా మార్గాన్ని వీడి పోలీసుల ఎదుట లొంగిపోయారు. పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఎదుట సోమవారం ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయినట్లు జిల్లా పోలీసులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంకు చెందిన కందర్ప దుర్గాప్రసాద్ అలియాస్ మోహన్, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాకు చెందిన ఆయన భార్య గొడ్డెళ్ల లచ్చుమమ్మ అలియాస్ ఉమా ఉన్నారు.
డీసీఎం స్థాయి బాధ్యతల్లో పనిచేసిన దంపతులు
కందర్ప దుర్గాప్రసాద్ మావోయిస్టు పార్టీలో డివిజనల్ కమిటీ సభ్యుడిగా, అర్బన్ డెన్ కీపర్‌గా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన భార్య లచ్చుమమ్మ జిల్లా కమిటీ సభ్యురాలిగా, అర్బన్ డెన్ కీపర్‌గా పనిచేసినట్లు పేర్కొన్నారు. వీరిద్దరూ డీసీఎం ర్యాంక్‌కు చెందినవారని పోలీసులు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ఉంటూ కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులతో సమన్వయం చేస్తూ సీపీఐ మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు.
సిద్ధాంతాలపై విసుగుతో జనజీవనంలోకి
మావోయిస్టు పార్టీ వరుస వైఫల్యాలు, కాలం చెల్లిన సిద్ధాంతాలతో విసిగిపోయి విప్లవోద్యమం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు లొంగిపోయిన వారు తెలిపారు. హింసా మార్గాన్ని వీడి సాధారణ జీవితం గడపాలనే ఉద్దేశంతో, ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానాలపై అవగాహనతో పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు పేర్కొన్నారు.
పునరావాసం కల్పిస్తాం: అదనపు ఎస్పీ
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. హింసా మార్గాన్ని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలనుకునే వారు ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల శాంతి, భద్రతలకు విఘాతం కలిగించే హింసాత్మక కార్యకలాపాలకు దూరంగా ఉండి సమాజ ప్రధాన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు.
