Suriya Rolex Re-entry | లోకేష్‌ నే అండగండి అంటూ.. సూర్య ఆసక్తికర కామెంట్స్‌!

ఆంధ్రప్రభ, సినిమాప్రతినిధి: కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘సీన్‌’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘రోలెక్స్‌’ పాత్రపై కామెంట్స్‌ చేయడం సినీ వర్గాల్లోనూ కాదు.. అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ పాత్రకు సంబంధించి దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌తో చర్చలు జరుగుతున్నాయని చెప్పడం అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. అంతేకాదు.. తనకు ఇప్పుడు ఓ బలమైన విలన్‌ అవసరమని సూర్య చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

రోలెక్స్‌ పాత్రపై మళ్లీ చర్చ

లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ నటించిన ‘విక్రమ్‌’ సినిమాలో చివర్లో కనిపించిన రోలెక్స్‌ పాత్ర ప్రేక్షకులకు ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. ఆ సినిమాలో కొద్దిసేపే కనిపించినప్పటికీ సూర్య తన నటనతో ఆ పాత్రకు భారీ క్రేజ్‌ తీసుకొచ్చారు. రౌద్రం, క్రూరత్వం, గంభీరమైన బాడీ లాంగ్వేజ్‌తో రోలెక్స్‌గా ఆయన కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.

విక్రమ్‌ సినిమాలోని రోలెక్స్‌ పాత్ర ఆధారంగా ప్రత్యేకంగా సినిమా రావాలని ఎప్పటి నుంచో ప్రేక్షకులు కోరుకుంటున్నారు. లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో రోలెక్స్‌ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అధికారికంగా కటించలేదు.

లోకేష్‌నే అడగండి..

‘సీన్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో అభిమానులు రోలెక్స్‌ పాత్ర గురించి ప్రస్తావించడంతో సూర్య స్పందించారు. ఈ ప్రాజెక్ట్‌ విషయంలో తెరవెనుక కొన్ని చర్చలు, ప్రక్రియలు కొనసాగుతున్నాయని తెలిపారు. లోకేష్‌ కనగరాజ్‌కు తనను కలవాలని, ఫోన్‌ చేయాలని అభిమానులే చెప్పాలని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సినిమాను నిజం చేయాలని తాను కూడా కోరుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు.

అంతటితో ఆగకుండా.. ‘హీరో కావాలా? విలన్‌ కావాలా?’ అని అభిమానులను అడిగారు. అందుకు ప్రేక్షకుల నుంచి విలన్‌ కావాలంటూ పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీనిపై సూర్య స్పందిస్తూ.. ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చారని, ఇప్పుడు ఒక బలమైన విలన్‌ అవసరమని వ్యాఖ్యానించారు. ఈ మాటలతో రోలెక్స్‌ పాత్రకు సంబంధించిన చర్చ మరోసారి ఊపందుకుంది.

మూడోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘సీన్‌’

సూర్యకు 2026 సంవత్సరం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు ‘సీన్‌’ సినిమాతో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. మలయాళ దర్శకుడు జీతు మాధవన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న జీతు మాధవన్‌.. తొలిసారి తమిళంలో దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

ఈ సినిమాలో సూర్య పోలీస్‌ అధికారి ఇన్బరాజ్‌ పాత్రలో కనిపించనున్నట్లు టీజర్‌ ద్వారా తెలుస్తోంది. అయితే ఇది సాధారణ పోలీస్‌ కథలా కాకుండా క్రైమ్‌, మర్డర్‌ మిస్టరీ, డార్క్‌ కామెడీ అంశాల కలయికతో రూపొందినట్లు ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి. కథలోని మలుపులు, సూర్య పాత్ర స్వభావం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

నజ్రియాకు కీలక పాత్ర.. నస్లెన్‌ విలన్‌గా..

ఈ సినిమాలో నజ్రియా నజీమ్‌ కథానాయికగా నటిస్తున్నారు. సూర్యతో ఆమెకు ఇదే తొలి సినిమా. దాదాపు 12 ఏళ్ల తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి తిరిగి వస్తున్న నజ్రియా.. ఇందులో మాయ అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం చిత్రబృందం గతంలో పలుమార్లు ఆమెను సంప్రదించిందని, నాలుగో ప్రయత్నంలో కథ నచ్చి అంగీకరించారని సూర్య వెల్లడించారు.

మలయాళ యువ నటుడు నస్లెన్‌ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. సూర్య వంటి స్టార్‌ హీరోకు ఎదురుగా యువ నటుడిని విలన్‌గా ఎంపిక చేయడం కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. జాన్‌ విజయ్‌, ఆనంద్‌రాజ్‌, లాల్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుషిన్‌ శ్యామ్‌ సంగీతం అందిస్తున్నారు. సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నవంబర్‌ 6న థియేటర్లలోకి..

దీపావళి కానుకగా నవంబర్‌ 6, 2026న ‘సీన్‌’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా సూర్యను విభిన్నమైన పోలీస్‌ పాత్రలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.