సూరారం గ్రామానికి బస్సు సౌకర్యం

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామ మహిళలు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేశారు. మహిళల విజ్ఞప్తికి స్పందించిన మంత్రి.. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు తక్షణమే చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా శనివారం హన్మకొండ నుంచి సూరారం గ్రామానికి ట్రయల్‌గా బస్సును నడిపించి, రాకపోకలకు మార్గం అనుకూలంగా ఉందా అనే అంశాన్ని పరిశీలించారు. గ్రామానికి బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తే విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని గ్రామస్థులు తెలిపారు.

తమ విజ్ఞప్తికి స్పందించి బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూరారం గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తే విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నీలా కొమురయ్య, ఉపసర్పంచ్‌ మేకల బాబు, సూరారం గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బచ్చు శ్రీధర్‌రావు, కుర్ర ప్రకాష్‌, చల్లూరి వేణు, మహమ్మద్‌ జావిద్‌, మొలుగూరి భాస్కర్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్‌, పి. సంపత్‌, ఛత్రపతి, గ్రామపంచాయతీ కార్యదర్శి ధర్మేందర్‌ తదితరులు పాల్గొన్నారు.