Supreme Court | జల వివాదాల కేసు విచారణ..

Supreme Court | జల వివాదాల కేసు విచారణ..

Supreme Court, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నేడు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల కేసు విచారణకు రానుంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడం పై సుప్రీం కోర్ట్ ను తెలంగాణ సర్కార్ ఆశ్రయించింది. తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్‌ పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుందని వాదిస్తుంది. ఏపీ అక్రమంగా నల్లమలసాగర్‌ ప్రాజెక్టును నిర్మించాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ తయారీ, సెగ్మెంట్‌ 1 కింద ఉండే ప్రస్తుత కనెక్టివిటీ పనుల విస్తరణ, కుడి ప్రధాన కాలువ నిర్మాణ కార్యకలాపాలు చేపట్టకుండా స్టే ఇవ్వండని కోరంది. కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖల ద్వారా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు/డీపీఆర్‌ మూల్యాంకనం చేయకుండా, చట్టబద్ధ అనుమతులు మంజూరు చేయకుండా, ఆర్థిక సహాయం అందించకుండా ఆదేశాలు ఇవ్వండి అని తెలంగాణ సర్కార్ పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 ప్రకారం 251 పేజీలతో తెలంగాణ తరఫున న్యాయవాది సుమంత్‌ నూకల రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు సోమవారం విచారణకు రానుంది. ఈ కేసులో బలమైన వాదనలు వినిపించేందుకు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించుకుంది. ఆదివారం ఢిల్లీలో ఆయనతో రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు సమావేశమై ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేశారు. మరి.. ఈ రోజు ఏం జరగనుందో చూడాలి.

Leave a Reply