Supreme Court| పోలీసులకు సుప్రీంకోర్టు షాక్.. కీలక ఆదేశాలు!

ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ: అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఈ గడువును పోలీసులు అరెస్టును అధికారికంగా నమోదు చేసిన సమయం నుంచి కాకుండా, సదరు వ్యక్తిని వాస్తవంగా నిర్బంధించిన క్షణం నుంచే లెక్కించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2)లో పేర్కొన్న ఈ నిబంధనను పోలీసులు తప్పనిసరిగా పాటించాలని కీలక తీర్పు వెలువరించింది.

ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అరెస్టును అధికారికంగా నమోదు చేయడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ, 24 గంటల గడువు మాత్రం ఆ వ్యక్తి స్వేచ్ఛను హరించి నిర్బంధించిన సమయం నుంచే ప్రారంభమవుతుందని ధర్మాసనం పేర్కొంది. అరెస్టు నమోదు చేసిన సమయాన్ని ప్రామాణికంగా తీసుకుని గడువును లెక్కించడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం కింద నమోదైన ఓ కేసులో ఈ తీర్పు వెలువడింది. తమకు బెయిల్ నిరాకరిస్తూ త్రిపుర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నలుగురు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లను విచారించిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం 24 గంటల గడువుపై స్పష్టత ఇచ్చింది.

సోదాలు, స్వాధీనం వంటి ప్రక్రియలు పూర్తయిన తర్వాత పోలీసులు అధికారికంగా అరెస్టు నమోదు చేసిన సమయం నుంచే 24 గంటల గడువును లెక్కించాలనే వాదనను ధర్మాసనం తిరస్కరించింది. వాస్తవంగా నిర్బంధించిన సమయాన్ని పక్కనపెట్టి, అధికారిక అరెస్టు సమయాన్ని పరిగణనలోకి తీసుకోవడం చట్టబద్ధం కాదని పేర్కొంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) ప్రకారం, అరెస్టయిన వ్యక్తిని ప్రయాణ సమయాన్ని మినహాయించి 24 గంటల్లోగా సమీప మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా ఈ గడువును దాటి నిర్బంధంలో ఉంచడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తిని 24 గంటలకు మించి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా నిర్బంధిస్తే, ఆ నిర్బంధం చట్ట విరుద్ధమవుతుందని, అతడిని తక్షణమే విడుదల చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ తీర్పుతో అరెస్టు ప్రక్రియలో పోలీసులు అనుసరించాల్సిన రాజ్యాంగ నిబంధనలపై సుప్రీంకోర్టు మరోసారి స్పష్టత ఇచ్చినట్లయింది.