Sunday Magazine | ఆదివారం సంచిక 17 ఆగస్ట్ 2025

ముఖపత్ర కథనం

అన్నిటా తోడుగా…
అదృశ్య మిత్రుడు..

ఆంధ్రప్రభ, వెబ్ సండే డెస్క్: అన్నదమ్ములతో…అక్క చెల్లెళ్ళతో కూడా పంచుకోలేని విషయాలు మిత్రులతో షేర్ చేసుకుంటాం. వాళ్ళు చిన్నప్పటి క్లాస్ మేట్స్ అయినా అయి ఉండాలి, లేదా మన ఇరుగు-పొరుగు ఇళ్ళళ్ళో ఉన్నవారు, మనతో కలిసి మెలిసి ఆడుకుంటూ పెరిగిన వారైనా అయి ఉండాలి. లేదా కొలీగ్స్ కూడా కావొచ్చు.

ఆపద సమయంలో తోడుండేది…ఆపన్న హస్తాన్ని అందించేదీ స్నేహితులే. అలాంటి స్నేహితుల వద్ద మనం రహస్యాలు ఏమీ మెయింటెయిన్ చెయ్యం. ఎందుకంటే వారిపై మనకున్న నమ్మకం అలాంటిది మరి.

కొంతమంది కాలక్రమాన దూరమైనా వారి జ్ఞాపకాలు మనల్ని వదలవు. మళ్ళీ ఎప్పుడో-ఎంతకాలానికో ఎక్కడో కనిపిస్తే ఆ అనందం మాటల్లో వర్ణింపలేనిది. మంచి మిత్రులు దూరంగా ఉన్నా ఫోన్లలో టచ్ లో ఉంటూ అన్నీ పంచుకుంటూ ఉంటాం.

అయితే ఇంతగా మన మనసుల్లో స్థానం, వారిపై నమ్మకం ఉండాలి అంటే వారితో మన అనుబంధం అంత దృఢంగా ఉండాలన్న మాట. మరి ఎప్పుడూ కంటితో చూడని, ఎలా ఉంటాడో తెలియని అదృశ్య మిత్రుల సంగతేమిటి?

(ఈమధ్య సోషల్ మీడియా పరిచయాలూ-స్నేహాలుగా దారి తీస్తున్నాయనుకోండి. అది వేరే సంగతి)
కనిపించని వారు తెలియని వారు అపరిచితులవుతారు గానీ, మిత్రులెలా అవుతారు? అనుకుంటున్నారా?
ఇప్పుడిదే ట్రెండ్. యూత్ అంతా అన్నిటినీ షేర్ చేసుకుంటున్న, అన్నిటికీ ఆధార పడుతున్న ఒకేఒక అదృశ్య మిత్రుడున్నాడు(ఉన్నది)

అదే…
చాట్ జీపీటీ…..

చాట్ జీపీటీ పాత్ర అంతా ఇంతా కాదు. ఏదడిగినా చెప్పేస్తుంది. ఎక్కడున్న సమాచారమైనా ఇస్తుంది. అన్నింటా సలహాలిచ్చేస్తుంది. సమస్యలకు పరిష్కారాలను వెంటనే సూచిస్తుంది. శాస్త్ర-సాంకేతిక స్మాచార విశేష విషయ భాండాగారం…చాట్ జీపీటీ….ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కావడానికి కృతిమ మేధనే అయినా, ఇది రొటీన్ గా ఏమీ స్పందించదు.

మన సమస్యను బట్టి, మనం అడిగిన ప్రశ్న నేపథ్యాన్ని బట్టి రకరకాలుగా స్పందిస్తుంది. కొండొకచో కొరివితో తలగోక్కున్నట్టు కూడా తిక్క తిక్క సమాధానాలిస్తుంది. తిరిగి మన సందేహాన్ని సరి చూసుకుని మళ్ళీ సంధిస్తే సరైన సమాధానం రాబట్టుకోవచ్చు. అందమైన బొమ్మ కావాలా? ఏ స్టైల్ లో కావాలి? వెంటనే గీసిచ్చేస్తుంది.

దీన్ని అంతగా నమ్ముకోవడం, దీనిపై అంతగా ఆధారపడడం అంత సురక్షితం కాదని సాక్షాత్తూ వీటి సృష్టికర్తలే చెప్తున్నా యువత దీనిపై ఆధారపడడం ఆపడం లేదు. పైగా దీని వినియోగం తమ దైనందిన జీవితంలో ఒక నిత్య కృత్యంగా మలచుకుంటున్నారు.

సమస్యలకు పరిష్కారాలను అన్వేషించడంలోనే మన బుర్ర రాటు దేలుతుంది. పదునెక్కిన ఆలోచనలే సరికొత్త ఆవిష్కరణలకు వేదికలవుతాయి. మరీ ఇంతగా మన మెదడును పక్కకు పెట్టి కృతిమ మేధపై ఆధారపడడం వల్ల లాభమా-నష్టమా?? ఆలోచించండి. మెదడు ఆలోచనలను మరచిపోదా? భవిష్యత్తులో కుక్క తోకనాడించడం పోయి తోకనే కుక్కనాడించడం అవదా?

సోషల్ మీడియాలో ఆత్రగాళ్ళు.

ఆంధ్రప్రభ వెబ్ సండే డెస్క్: సోషల్ మీడియా అంటేనే ఏది తోస్తే అది, ఎవరుపడితే వాళ్ళు మారు ఆలోచన లేకుండా పోస్ట్ చేసేది. మళ్ళీ అందులో ఆత్రగాళ్ళు, నిదానస్తులు కూడా ఉంటారా ? అని అనుకోకండి. ఉంటారు. కొంతమంది తటస్థ వైఖరి వాళ్ళు అన్ని పోస్టులూ చూస్తారు. కానీ దేనికీ స్పందించరు. దేనికి ఏ సింబల్ పెడితే తమను ఏ వర్గానికి అంట్గడతారో అని వీళ్ళ యొక్క అభద్రతాభావం.

ఇక మనం చెప్పుకోబోయే ఆత్రగాళ్ళు అదో టైపు. అన్నిట్లో దూరిపోతారు. అసలు పోస్టులో ఏముందో కూడా సరిగా చూడరు. పూర్తిగా చదవరు. అయినా అతిగా స్పందిస్తారు…సందేహాలు వెలిబుచ్చుతారు. మొత్తానికి ఆ పోస్టును కంపు కంపు చేసేసి వదులుతారు. ఉదాహరణకు ఒక పోస్టులో “మా ఇంట్లో కరెంటు పోయింది” అని ఉందనుకోండి. వీళ్ళు మధ్యలో దూరిపోయి కామెంట్ బాక్స్ లో” అంటే మా కొత్త ప్రభుత్వం కరెంట్ ఇవ్వడం లేదంటారా” అంటూ ఒంటికాలిమీద లేస్తారు.

ఇక ఇంకో ఆత్రగాడు మధ్యలో దూరిపోయి, “అవును, ఇవ్వడం లేదు… అంతకు ముందున్న మా ప్రభుత్వమే మేలు…మీది అసమర్థ ప్రభుత్వం” అంటూ కౌంటరు కామెంటు…వీరిద్దరి వాదనలకు తోడు మరొకరు దూరిపోతారు. చిట్ట చివరకు పోస్టు పెట్టిన వారు కాస్తా చూసే సరికి వరద ప్రబ్వాహానికి గోదావరి నీటి మట్టం పెరిగినట్టు ఈ కామెంట్ల వరద ఉధృతంగా ప్రవహిస్తూంటుంది.

ఇలా కాదని పోస్ట్ పెట్టిన వాళ్ళు “అయ్యో…షార్ట్ సర్క్యూట్ వల్ల ఫ్యూజ్ పోయి, కరెంటు లేదు..ఆ విషయమే షేర్ చేసా ” అని కన్ క్లూజన్ ఇచ్చేసరికి ఈ కామెంట్లన్నీ గప్ చుప్. ఇక పోస్ట్ పెట్టేది ఏ అమ్మాయిగారో అయితే చిట్కాలతో-ఉపాయాలతో-తోచిన పరిష్కారాలతో సిద్ధం ఈ ఆత్రగాళ్ళు…వాళ్ళు చాలు చాలనే దాకా పొడిగిస్తూనే ఉంటారు. కొనసాగిస్తూనే ఉంటారు. అట్లుంటది…ఆత్రగాళ్ళతోని.




‘అప్పల రాజు’ ఎగిరి గంతేసాడు. అతడు అలా ఎగిరి గంతు వెయ్యడానికి మంచి కారణం ఉంది. అది ఏంటంటే – అతనికి ఆఫీస్‌ తరపున డెప్యుటేషన్‌ మీద ” పారిస్ ” నగరానికి వెళ్ళే అవకాశం వచ్చింది. ఎన్నాళ్ళ నుండో అతను కంటున్న కల అది ! తన తోటి కొలీగ్స్ ఇంతకు ముందు ఫారెన్‌ వెళుతుంటే వాళ్ళను అసూయగా చూసేవాడు.

కానీ ఇప్పుడు తనకు ఆ అవకాశం వచ్చింది. బాస్‌ పిలిచి ఈ విషయం చెప్పగానే అతని కాళ్ళు పట్టుకుని ‘ థాంక్యూ సార్‌…థాంక్యూ’ అంటూ  ‘ నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడయ్య నా చేతులు ..ఆ చేతులనలా విదిలించకు ఎల్లపుడూ అసలు ‘ అని పాడ  సాగాడు.

” చాలు బాబూ చాలు..నీకో నమస్కారం ” అంటూ కంట తడి పెట్టుకున్నాడు బాస్‌. వదల్లేక వదల్లేక బాస్‌ ని ..ఐ మీన్‌ అతని కాళ్ళని వదిలి  బయటకు వచ్చాడు  రాజు . వెంటనే పెళ్ళాం పార్వతి కి ఫోన్‌ చేసి –

” ఏమోయ్‌ …నాకు ఫారెన్‌ వెళ్ళే ఛాన్స్  వచ్చింది ” అని గొప్పగా చెప్పాడు. ” అలాగా …సూపర్‌ అండి ” అంటూ ఫోన్‌ లోనే గట్టిగా అరిచింది పార్వతి.

” చాలు …ఇక పెట్టేయ్‌ ” చెవులు మూసుకుంటూ  ఫోన్‌ కట్‌ చేసాడు  అప్పలరాజు.

వైజాగ్‌ దగ్గర పల్లెటూరు అతనిది. జాబ్‌ రీత్యా హైదరాబాద్‌ లో సెటిల్‌ అయ్యాడు.  పొట్టిగా తెల్లగా ఉంటాడు  . అందరితోనూ సరదాగా ఉండటం అతని నైజం.


రాజు  ఒక ఏజెంట్‌ ని పట్టుకుని పాస్‌ పోర్ట్‌ తెచ్చుకోవడంలో మునిగిపోయాడు. కొన్ని రోజులకి పాస్‌ పోర్ట్‌ వచ్చింది. అందమైన ఆ చిట్టి బ్లూ కలర్‌ బుక్‌ లో కోటు వేసుకున్న తన ఫోటో ని , పక్కనే చక్కగా వ్రాయబడిన తన పూర్తి పేరుని  చూసుకుని మురిసి ముక్కలైపోయాడు . వీసా మాత్రం ఆఫీసు వాళ్ళు ఎరేంజ్‌ చేసారు.

తర్వాత డబ్బులు సమకూర్చుకుని , ట్రేవెల్‌ ఏజెంట్‌ ద్వారా ఫ్లయిట్‌ టికెట్స్‌  కూడా బుక్‌ చేయించాడు . అప్పుడు  రిలాక్స్‌ అయ్యాడు. ఫారెన్‌ వెళ్ళబోతున్న ఆనందం , ఎక్సైట్‌ మెంట్‌ నెమ్మదిగా అతని శరీరంలోకి ప్రవేశించి  అదో కొత్తరకమైన ఉత్తేజాన్ని కలిగించ సాగింది. ప్రతీ రోజూ బాస్‌ కేబిన్‌ లోకి వెళ్ళి ‘ నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడయ్యా నా చేతులు…’ పాట వినిపిస్తూనే ఉన్నాడు. బాస్ కూడా ‘ చాలు బాబూ …ఇక చాలు ‘ అని కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉన్నాడు.ఫారెన్‌ వెళ్ళాల్సిన సమయం రానే వచ్చింది.

చక్కగా సూట్‌ కేసు పట్టుకుని , భార్యకు బై బై చెప్పి , హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధి ఎయిర్‌ పోర్ట్‌ లో పారిస్‌ వెళ్తున్న ఫ్లయిట్‌ ఎక్కేసాడు రాజు .

పారిస్‌ – ఛార్లెస్‌ డిగాలే ఎయిర్‌ పోర్ట్‌ !

లగేజ్‌ తో బయటకు వచ్చాడు రాజు. అప్పుడే తెల్లవారింది. చల్లగా ఉంది వాతావరణం.  ” వెల్కం మిస్టర్‌  రాజు సార్‌..” అంటూ ఆహ్వానించాడు సుభాష్ శైనీ ! అతను అక్కడ కంపెనీ తరపు రిప్రజెంటేటివ్.ఇండియన్ మూలాలు ఉన్నవాడు.  ఇండియా  నుండి వచ్చిన డెలిగేట్స్ కిఅన్ని ఏర్పాట్లు చూసుకుంటాడు.  

” ఓహ్‌..థాంక్యూ ” అంటూ అతన్ని అనుసరించాడు రాజు. నల్లటి పెద్ద వేన్‌ లాంటి వాహనం లో అతన్ని కూర్చోబెట్టి నోవాటెల్‌ హోటల్‌ కి తీసుకెళ్ళాడు శైనీ. అప్పటికే అతని పేరు మీద రూం బుక్‌ చెయ్యబడి ఉంది.

” వెల్కం మిస్టర్‌ రజు సార్‌ ..” ఆహ్వానించాడు అక్కడి రిసెప్షనిస్ట్‌ . ” నా పేరు రజు కాదు రా …రాజు …రాజు ” అని మనసులో మొత్తుకున్నాడు రాజు. శైనీ అతన్ని రూం లోకి పంపించి , అన్ని జాగ్రత్తలు చెప్పి ”  తొమ్మిదింటికి వెహికల్‌ వస్తుంది సార్‌…బ్రేక్‌ ఫాస్ట్‌ చేసి రడీగా ఉండండి ” అని చెప్పి వెళ్ళిపోయాడు

తర్వాత ఫ్రెష్  అయి , రెస్టారెంట్‌ లో బఫే మీద పడ్డాడు. ఎన్నో రకాల పదార్ధాలని ఫ్రూట్స్‌ ని చూసి నోరూరి పోయింది అతనికి. వాటి మీద దాడి చెయ్యబోతుండగా ఒక నల్ల జాతీయుడు అడ్డు వచ్చాడు. బలంగా ఎత్తుగా ఉన్నాడు.

” ఎక్స్యూజ్‌ మీ ..” అంటూ అతన్ని తప్పుకుని ముందుకు వెళ్ళాడు రాజు. ప్లేట్‌ తీసుకుని పదార్ధాలు వడ్డించుకున్నాడు. అతని వెనకే ఆ నల్ల జాతీయుడు కూడా రాజు మీద విసుక్కుంటూ ప్లేట్‌ లో పదార్ధాలు పెట్టుకున్నాడు . ఒకటేబుల్‌ దగ్గరకు వచ్చి కూర్చుని తినసాగాడు రాజు.  నల్ల వాడు కూడా అతని టేబుల్‌ దగ్గరకే వచ్చి , నోరు మొత్తం తెరిచి తింటున్నాడు. వాడి నోటి వైపే కళ్ళు మిటకరించి కుక్క చూపులు చూస్తున్నాడు రాజు.

” హే మేన్‌ ….యు వాంట్‌ దిస్‌ ” అంటూ తన చేతిలోని లెగ్ పీస్ను చూపించాడు ఆ నల్లవాడు

” నో..నో.. ఐ డోంట్‌ వాంట్‌ ..” అంటూ సిగ్గుపడిపోయాడు రాజు. టిఫిన్‌ తినడం ముగించి టీ తీసుకోవడానికి వెళ్ళాడు. అతని వెనకే నల్లవాడుకూడా. వేడి వేడి టీ కప్పు లో పోసుకుని  వెనక్కు తిరిగాడు రాజు. అదాటున ..అడ్డంగా ఎత్తైన గోడలా నిల్చున్న నల్లవాడిని ఢీ కొన్నాడు . కప్పులోని వేడి టీ ఆ నల్లవాడి కాళ్ళ మధ్య భాగంలోకి ఒలికింది.

అంతే… అక్కడ బాగా కాలినట్టు ఉంది. ” యు..షార్ట్‌ పిగ్‌ ” అని గాడిదలా ఓండ్ర పెట్టి రెండు చేతులు కాళ్ళ మధ్య పెట్టుకుని వాష్  రూం వైపు పరుగుపెట్టాడు ఆ నల్లవాడు. కలకలం రేగింది రెస్టారెంట్‌ లో !  తుపాకి సౌండ్‌ కి ఎగిరి పోయిన  కాకిలా  బయట తన వెహికల్‌ వైపు పరుగెత్తాడు రాజు  . కేబ్‌ లో కూలబడి ” గో…” అని గట్టిగా అరిచాడు. బుల్లెట్ లా దూసుకెళ్ళింది ఆ నల్లటి ప్రైవేట్‌ కేబ్‌ !!!

                                        *            *          *

సాయంత్రానికి ఆఫీసు పని చూసుకుని హోటల్‌ కి వచ్చేసాడు రాజు.

ఈఫిల్‌ టవర్‌ దగ్గరకి వెళ్ళడానికి ట్రిమ్ముగా రడీ అయ్యాడు. హోటల్‌ బయటకు వచ్చి వాకబుల్‌ డిస్టెన్స్  కదా అని నడవడం మొదలు పెట్టాడు.  టవర్ ని చేరుకున్నాక దాని పైకి ఎక్కి అన్నీ చూసాడు. ఇంతలో టవర్‌ మీద లైట్లు వెలిగాయి. జిగేల్‌ మని మెరుస్తూ మరింత అందాన్ని సంతరించుకుందిఈఫిల్‌ టవర్‌. ఆ సౌందర్యాన్ని ఆస్వాదించి వెనక్కు మళ్ళాడు.

నెమ్మదిగా నడుచుకుంటూ హోటల్‌ బాట పట్టాడు. వెళ్తున్నప్పుడు ఎంతో అందంగా అనిపించిన దారి ఇప్పుడు చీకటి పడటం వల్ల , చెట్ల గుబురు వల్ల కొంచెం భయం గొలిపేలా ఉంది. జన సంచారం కూడా పలచగా ఉంది.

హోటల్‌ ఇంకా వంద మీటర్ల  దూరంలో ఉందనగా…ఎక్కడి నుండి వచ్చారో ఇద్దరు  నల్ల వాళ్ళు  రాజు ని చుట్టు ముట్టారు.

” హే మేన్‌ గివ్‌  దవాలెట్‌  … గివ్‌ ద మనీ ” అంటూ బెదిరించ సాగారు. బలంగా ఎత్తుగా ఉన్నారు వాళ్ళు. విపరీతమైన భయం వేసింది రాజుకి. అయినా బయటపడకుండా …

” ఐ డోంట్‌ హేవ్‌ మనీ ..” అని గట్టిగా చెప్పాడు.

” నో …గివ్‌ ద మనీ …అదరవైజ్వియ్‌ విల్‌ కిల్‌ యు ..” అంటూ ఇంకా దగ్గరగా వచ్చారు. రాజు తెగించాడు. చిన్నప్పటి నుండీ తెలుగు సినిమాల్లోచూస్తున్న తన అభిమాన హీరో  ఫైట్స్‌ గుర్తొచ్చాయి. ఒక్కసారిగాకాళ్ళు చేతులు సాగదీసి ” హు…య్యా ..” అంటూ ఒక కరాటే స్టిల్‌ పెట్టాడు. కొంచెం వెనక్కు తగ్గారు వాళ్ళు . కాన్ఫిడెన్స్ పెరిగింది రాజుకి.

విజిల్‌ వేసి , చిటికె వేస్తూ “కమాన్‌…కమాన్‌..” అంటూ చేతులతో వాళ్ళ ని ఫైటింగ్‌ కి రమ్మంటూ సైగ చేసి ఇంకో కరాటే  స్టిల్‌ పెట్టాడు. వాళ్ళకి భయం వచ్చింది. రాజు  కరాటే లో బ్లాక్‌ బెల్ట్‌ లెవెల్‌ సాధించి ఉంటాడని ..తమ పప్పులు ఉడకవని వాళ్ళు అనుకున్నారు. అంతే… వెనక్కు తిరిగి పారిపోయి ఆ చెట్లలో మాయం అయిపోయారు. మరుక్షణం  వాళ్ళకంటే వేగంగా ‘ బ్రతుకు జీవుడా ‘ అనుకుంటూ రాజు కూడా పరుగెత్తి హోటల్లోకి వచ్చి పడ్డాడు.

                                       *               *               *

సరైన తిండి లేక ..ప్రాణాలకు రక్షణ లేక, ఆ ఫారెన్ రౌడీలతో ఫైటింగ్ కూడా చేసి , చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన …ఆఫీసు పని పూర్తి చేసుకుని ‘ బ్రతుకు జీవుడా ‘అనుకుంటూఇండియా కు తిరుగు ప్రయాణం అయ్యాడు రాజు.   పన్నెండు గంటల ప్రయాణం తర్వాత హైదరాబాద్‌ లో ఫ్లయిట్‌ లేండ్‌ అయింది . లగేజ్‌ తీసుకుని బయటకు వచ్చాడురాజు. జన్మ భూమిని చూసి సంతోషపడిపోయాడు .  రిసీవింగ్‌ కోసం వచ్చిన భార్య పార్వతిని పట్టుకుని భోరున విలపించాడు ‘ ఇంకోసారి ఫారెన్ వెళ్ళేదే లేదు‘అని మనసులోగట్టిగా  ఒట్టు పెట్టుకుంటూ. కంగారు పడింది పార్వతి. ” ఏమయిందండీ..ఎందుకీ కన్నీళ్ళు ? ” అని కలవరపడింది.

 ” ఆనంద భాష్పాలే …నిన్ను చూసిన ఆనంద భాష్పాలు ” అంటూ కవరింగ్‌ చేసేసాడురాజు.నిజమే అనుకుని మురిసి ముక్కలైపోయింది పార్వతి భర్తను గట్టిగాకౌగలించుకుంటూ !!!!

Leave a Reply