Sunday Magazine 02 Nov 2025 | ఆదివారం సంచిక 02 నవంబర్ 2025

ఈ సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.. 
–అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.

ఈ సంచికలో…

1)జక్కన్న మళ్లీ చెక్కిన…
2)మనసు-మాట శీర్షిక
3)పాపం  ప్రభాకరం
4)కబుర్లు- శీర్షిక
5)మెదడుకు మేత-సామెత.. శీర్షిక
6)నిజాయతీ ఎప్పుడూ మంచిదే! (కథ)
7)సన్నిహితం – శీర్షిక
8)వినరో భాగ్యము – శీర్షిక

1)జక్కన్న మళ్లీ చెక్కిన…

బాహుబలి ఓ సంచలనం.. బాహుబలి 2 ఓ చరిత్ర. ఈ సినిమాతో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి మరోసారి తెలిసింది. ఇంకా చెప్పాలంటే.. ఈ సంచలన చిత్రంతోనే ఒక కథను రెండు పార్టులుగా కూడా చెప్పచ్చు అనే ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. అలాగే పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కూడా మొదలైంది. బాహుబలి సినిమా వచ్చిన తర్వాత స్టార్ హీరోలే కాదు.. మీడియం రేంజ్ హీరోలు, యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమా చేయాలని తపిస్తున్నారు. బాహుబలి స్పూర్తితో తెలుగులోనే కాదు.. మిగిలిన భాషల్లో కూడా ఒక కథను రెండు భాగాలుగా చెప్పడం అనేది స్టార్ట్ అయ్యింది. అయితే.. ఇప్పుడు జక్కన్న మరో ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. ఇంతకీ.. బాహుబలి స్పూర్తితో ఏ ఏ సినిమాలు వచ్చాయి..? దర్శకధీరుడు శ్రీకారం చుట్టిన నయా ట్రెండ్ ఏంటి..?

బాహుబలి సినిమా చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ ఒక్క సినిమాతో బాలీవుడ్.. టాలీవుడ్ వైపు చూడడం స్టార్ట్ చేసింది. అంతే కాదండోయ్.. ఇండియన్ సినిమాకి కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ అనుకునే వాళ్లకు మతిపోయేట్టు చేసింది. ఇప్పుడు టాలీవుడ్ ఇండియన్ సినిమాకి కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ఇక బాహుబలి సినిమా స్పూర్తితో వచ్చిన సినిమాలు అంటే.. కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2, పుష్ప, పుష్ప 2, పొన్నియన్ సెల్వన్, పొన్నియన్ సెల్వన్ 2, కల్కి, కల్కి 2 (రావాల్సివుంది..) సలార్, సలార్ 2 (రావాల్సివుంది..). బాహుబలి తీసిన రాజమౌళి స్పూర్తితోనే పొన్నియన్ సెల్వన్ సినిమాను రెండు పార్టులుగా తీసినట్టుగా మణిరత్నం స్వయంగా తెలియచేయడం విశేషం.

బాహుబలి పార్ట్ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. అంతే కాకుండా.. 1000 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి భారతీయ సినిమాగా బాహుబలి 2 చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు తెలుగు సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడం అంటే గొప్పగా ఉండేది. అలాంటిది మన తెలుగు సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుండడం విశేషం. బాహుబలి సినిమాతో టాలీవుడ్ వైపు బాలీవుడ్ చూస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూస్తుండడం మరో విశేషం. ఇక ఆస్కార్ అవార్డ్ అంటే.. అది మనకు సంబంధం లేనిది.. హాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఇస్తారు అనుకునేవాళ్లు.

అలాంటిది మన తెలుగు పాటకు ఆస్కార్ అవార్డ్ తీసుకువచ్చి చరిత్ర సృష్టించారు దర్శకధీరుడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటతో ప్రపంచం మొత్తాన్ని ఊర్రూతలూగించారు. భారతదేశం తరుపున అధికారికంగా ఆర్ఆర్ఆర్ మూవీని ఆస్కార్ కు నామినేట్ చేయకపోయినా.. ఆస్కార్ తీసుకువచ్చారు. దటీజ్ రాజమౌళి అనిపించారు. ఒక్క తెలుగువారే కాదు.. దేశం మీసం మెలేసేలా చేసి మనందరికీ గర్వకారణం అయ్యేలా నిలిచారు మన జక్కన్న. పట్టుదల ఉంటే.. సాధ్యం కానిది లేదు అని మరోసారి నిరూపించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన పట్టుదల, కృషి, తపన, తపస్సు గురించి.. ఎంత చెప్పినా తక్కువే.

ఇక అసలు విషయానికి వస్తే.. జక్కన్న ఇప్పుడు నయా ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. అది ఏంటంటే.. రెండు పార్టులుగా తీసిన బాహుబలి సినిమాను ఒక పార్ట్ గా చేసి బాహుబలి ఎపిక్ పేరుతో రిలీజ్ చేశారు. రాజమౌళి తెలివే తెలివి కదా.. దీనికి ఒక్క తెలుగులోనే కాదు.. పాన్ ఇండియా రేంజ్ లో అనూహ్య స్పందన వచ్చింది. బాహుబలి ఎపిక్ ను రిలీజ్ చేయడం కోసం ఎడిటింగ్ చేసేసి ఏదో రిలీజ్ చేసేద్దాం అనుకోలేదు. ఒక కొత్త సినిమాను రిలీజ్ చేస్తే.. ఎంత కేర్ తీసుకుంటారో.. ఎలాగైతే ప్రమోట్ చేస్తారో అలా ప్రమోట్ చేశారు. ప్రభాస్, రానాలతో కలిసి ఇంటర్ వ్యూ చేశారు. సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేశారు. బాహుబలి రెండు పార్టుల్లో కథ ఏంటో.. సినిమా ఎలా ఉంటుందో జనాలకు బాగా తెలుసు. అయినప్పటికీ.. బాహుబలి ఎపిక్ ను థియేటర్స్ లో చూడడానికి జనాలు ఎగబడ్డారు. ఈవిధంగా పాత సినిమాను కొత్తగా రిలీజ్ చేయడంలోనూ జక్కన్న తన మార్క్ చూపించడం విశేషం.

అయితే.. బాహబలి రెండు పార్టులను ఒక పార్ట్ గా చేసి రిలీజ్ చేయడం.. దీనికి అనూహ్య స్పందన రావడంతో ఇప్పటి వరకు వచ్చిన సీక్వెల్స్ ఒక పార్ట్ గా రానున్నాయని టాక్ వినిపిస్తుంది. పుష్ప, పుష్ప 2, కేజీఎఫ్, కేజీఎఫ్ 2, పొన్నియన్ సెల్వన్, కల్కి, కల్కి 2, సలార్, సలార్ 2.. తదితర చిత్రాలను ఒక పార్ట్ గా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని.. ఇలా రిలీజ్ చేయడం కోసం ఈ సీక్వెల్స్ మేకర్స్ ఆలోచనలో పడ్డారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఈవిధంగా జక్కన్న నయా ట్రెండ్ కి శ్రీకారం చుట్టారని చెప్పచ్చు. చూడాలి మరి.. ఎన్ని సీక్వెల్స్ ఒక పార్ట్ గా వస్తాయో.. ఎంత వరకు ఆకట్టుకుంటాయో..?


2) మనసు-మాట శీర్షిక

పాఠకులందరికి నమస్సులు.
ఈ వారం అఖిల్ అనే ఒక అబ్బాయి మనసు-మాటతో మీ ముందుకు తీసుకొచ్చాం.

అఖిల్ మనసు-మాట: నేను 10 వ తరగతి చదువుతున్న 15 సంవత్సరాల అబ్బాయిని.
మా నాన్న బొగ్గు గనులలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. అమ్మ-నాన్న, చెల్లి, ఇదే నా ప్రపంచం. నాన్న 7వ తరగతి వరుకు చదువుకున్నారు. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే తను ఆర్థికంగా వెనకబడివున్నానని దిగులు పడుతూ ఉంటారు.

నేను బాగా చదువుకుని, మంచి ఉద్యోగంలో స్థిరపడి తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నది తన కోరిక అని ఎప్పుడు చెప్తూ ఉంటారు మా నాన్న. ఆయన జీవితంలో ఉన్న వెలితిని పూర్చాలి అన్న దృఢ నిశ్చయంతో నేను చాలా బాగా చదువుకొనేవాడిని.

నేను సరిగ్గా చదవలేకపోయినా, మార్కులు తగ్గినా అమ్మ-నాన్నతోపాటు నేను కూడా చాలా కుమిలి పోయే వాడిని. ఒక రోజు నాకు అకస్మాత్తుగా స్కూల్లో కాళ్ళు, చేతులు బాగా వణికిపోయి, వళ్ళంతా చెమటలు పట్టి, గుండె దడ పెరిగి పోయి చనిపోతానేమో అన్నంత భయం కలిగింది. ఊపిరి తీసుకోవడం కష్టమయ్యింది, కళ్లు తిరిగి పడిపోతానన్న భయంతో టీచర్ కి చెప్పాను. అమ్మను పిలిచి నన్ను ఇంటికి పంపించేశారు.

కొంత సేపటికి సర్దుకున్నప్పటికి తరుచు ఇలానే జరిగేది. డాక్టర్లు అన్ని టెస్టులు చేయించి, శారీరకంగా ఏ సమస్య లేదని చెప్పారు. నా ప్రాబ్లెం ఏమిటో కుటుంబంలో ఎవ్వరికి అర్థం కాలేదు. టీచర్లు ఇంటిలోనే వుండి చదువుకోమన్నారు, ఫ్రెండ్స్ నా నోట్స్ రాసిచ్చేవారు, అమ్మ నాన్న కూడా చదువుకోమని చెప్పేవారు కాదు. స్కూల్ కి వెళ్లడం పూర్తిగా మానేసాను ఒకవేళ వెళ్లినా, కాళ్ళు, చేతులు బాగా వణికిపోయి, వళ్ళంతా చెమటలు పట్టి, గుండె దడ పెరిగి పోయినా ఇంటికి వెళ్లిపోయే వాడిని. అసలు నాకు ఏం జరుగుతుంది?

సైకాలజిస్ట్ మాట:

అఖిల్! మీరు అనుభవిస్తున్న మానసిక పరిస్థితిని ‘పానిక్ అటాక్స్’ అని అంటారు.

అఖిల్ క్ర్ సూచనలు: మీ తండ్రి కలలు మీరు సాకారం చెయ్యాలని మీరు వత్తిడికి లోనవుతున్నారు. ఆయన తన జీవితంతో ఆనందంగా లేరు (విక్టిమ్ మెంటాలిటీ) అని మీకు పదే పదే చెప్పడంతో అయన ఆనందానికి మీరే బాధ్యత స్వీకరించారు.
బాగా చదివి, తరగతిలో అందరి కంటే మీరే ముందుండాలి, జీవితంలో ఆర్థికంగా బాగా స్థిరపడాలి అప్పుడే మీ వలన అమ్మ నాన్న ఆనందంగా వుంటారనుకున్నారు. నాన్నలో ఉన్న వెలితి పోతుంది అని భావించారు. చదువులో బాగా రాణిస్తే మీపై మీకు మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నారు. అలా కానప్పుడు మిమల్ని మీరే కించపర్చుకుంటున్నారు. మీ ఈ ప్రవర్తన మరియు ఇంటి వాతావరణంలో ఉన్న వత్తిడి వలన మీరు మీ మైండ్ మీద విపరీతమైన వత్తిడి కలిగించారు. ఈ వత్తిడిని మీ మైండ్ ఇప్పటి వరకు భరించినా, ఇక మీదట నా వలన కాదు అని నిరాకరిస్తుంది అందుకే పానిక్ అవుతుంది.

ది మైండ్ వాయిస్:

తల్లితండ్రులను ఆనందింపజెయ్యాలన్న బాధ్యతలో నీ ఆనందం మర్చిపోవద్దు, కోల్పోవద్దు అఖిల్!

తల్లిదండ్రులకు సూచనలు:

  1. తరుచు కంప్లైంట్స్ చెయ్యడం, పరిష్కారాలు వెతుక్కోక పోవడం వలన, ఆనందంగా లేము అని చెప్పుకోవడం వలన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.
    దీనినే బాధిత మనస్తత్వం (victim mentality) అని అంటారు. నివారణ చాలా అవసరం.
  2. మన జీవితం మన నియంత్రణలో ఉంటుంది అన్నది తల్లితండ్రులు ఆచరణలో చూపించడం వలన పిల్లలు కూడా కష్టాలు ఎదుర్కోవడం నేర్చుకుంటారు.
  3. మీ కలలు మీరు సాకారం చేసుకోవాలి, అలా కుదరని పక్షంలో వాస్తవ పరిస్థితులను స్వీకరించి, రాజీ పడి, ఉన్నంతలో, అందిన వాటితో ఆనందంగా జీవించాలి. అదే పి అంటే కానీ పిల్లలను మీ కలలు సాకారం
    చెయ్యమని చెప్పకూడదు


3)పాపం  ప్రభాకరం కథ

ప్రభాకరం రిటైర్  అయ్యాడు. అతనికి పొద్దున శుచిగా స్నానం చేసి, ధ్యానం చేసుకోవాలని చాలా రోజులనుంచి కోరిక. ఇప్పుడైనా చేసుకుందామని, ఒక మంచిరోజు చూసుకుని పొద్దున్నే ధ్యానానికి కూర్చున్నాడు. ఇంట్లో అందరూ తనను వింతగా చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు. “నేను ధ్యానానికి  కూర్చుంటున్నాను. “ఎవరూ డిస్టర్బ్ చేయకండి” అన్నాడు.

గది బయట ‘డోంట్ డిస్టర్బ్’ అనే బోర్డు పెట్టనా” అన్నది భార్య సుజాత.

ధ్యానం మొదలు పెట్టాడు. అయిదు నిమిషాల వరకు బాగానే గడిచింది. ఇంతలో, “సుజాతా!” అంటూ లోపలికి వచ్చింది పక్కింటి శాంతి. ఆవిడ నేరుగా వంటింట్లోకి వెళ్తూ, పూజ గదిలోకి తొంగి చూసి, “ఏంటి అన్నయ్యగారూ! ఈవేళ ఇంత నిష్ఠగా ధ్యానం చేస్తున్నారు.” అంటూ గట్టిగా నవ్వుతోంది. అప్పుడు సుజాత బాత్ రూమ్ లో ఉన్నట్టుంది.

“సుజాత ఏదీ?” అంటూ కలియ తిరిగుతూ, “సుజాతా! సుజాతా!” అంటూ కొంపలు మునిగి పోయినట్టు అరుస్తోంది. ప్రభాకరానికి ఒళ్ళు మండిపోయింది. అయినా తమాయించుకుని, “బాత్ రూమ్ లో ఉన్నట్టుంది.” అని సమాధానమిచ్చాడు. దానితో ధ్యానానికి బ్రేక్ ఏర్పడింది.

అంతలో సుజాత వచ్చి, శాంతిని లాక్కుని బయటికి వెళ్ళింది. మళ్ళీ మొదలు పెట్టాడు. గేటు బయటినుంచి గట్టిగా మాటలు వినబడుతున్నాయి. పళ్ళు నూరుకున్నాడు. అలాగే మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కుక్కర్ విజిల్ వచ్చింది. అయిదారు విజిల్స్ వచ్చినా సుజాత లోపలికి రాలేదు. పట్టించుకోకూడదనుకుని, అలాగే కళ్ళు మూసుకున్నాడు. కుక్కర్  మాడు వాసన  వేయసాగింది. ఇక ప్రభాకరానికి సహనం నశించింది. “సుజాతా!” అని ఒక్క గావుకేక పెట్టాడు. అప్పుడొచ్చింది నింపాదిగా. “అయ్యో కుక్కర్ మాడిపోయిందే!  మీరు ఆఫ్ చేయవచ్చు కదా!” అన్నది. భర్త  ధ్యానం విషయం గుర్తొచ్చి, చటుక్కున నాలుక్కరుచుకుంది. ఇక ఆ రోజుకు ధ్యానం విరమించుకున్నాడు. 

మరుసటి రోజు మళ్ళీ ధ్యానానికి కూర్చున్నాడు. పక్కింటి శాంతి రాలేదు. అందుకే ప్రశాంతంగా సాగిపోతోంది ఆయన ధ్యానం. అంతలో తన ఫోన్ అదే పనిగా మ్రోగడం మొదలు పెట్టింది. ‘ఏమిటో అంత కొంపలు మునిగే పని?’ అని విసుక్కుంటూ ఫోన్ తీసి “హలో” అన్నాడు. “సార్  ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. కావాలా?” అన్నారు. “ఫోన్ పెట్టేయ్ ముందు.” గావుకేక వేశాడు.

ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. ఇంతలో భార్య ఫోన్ మోగుతోంది.  ఈవేళ సుజాత, శాంతి ఇంటికి వెళ్లినట్టుంది. ‘ఫోన్ తీసుకెళ్ళే అలవాటు లేదు.’ పళ్ళు పటపట కొరుక్కుంటూ లేచి ఫోన్ ఆఫ్ చేద్దామని చూసాడు.  తన తండ్రి కాల్ చేస్తున్నాడు. ‘ బాబోయ్! అసలే నాన్నకు కోపం ఎక్కువ.’ అనుకుంటూ మాట్లాడాడు. “ఏంట్రా? ఏమైంది నీ ఫోన్ కు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది.” కోపంగా అడిగాడు. ఏం చెప్పాలో తెలియక నీళ్ళు నమిలాడు. “ఫోన్ పాడైనట్టుంది నాన్నా! అందుకే వినబడలేదు.”  ఠకీమని అబద్ధం చెప్పాడు. “ఎవరండీ ఫోన్ చేస్తోంది?” అప్పుడొచ్చింది సుజాత.

మరుసటి రోజు…

ఇక ఇంట్లో అయితే ఇలాగే డిస్టర్బ్ అవుతుందని, పంచె, లాల్చీ వేసుకుని గుడికి వెళ్ళి, అక్కడ ఒక మూలగా కూర్చున్నాడు.

ఇంతలో “ఒరేయ్ ప్రభాకరం! ఏంటి ఎన్నడూ లేనిది గుడికొచ్చావ్? అంత భక్తి పుట్టేసిందేమిటి?” అని ఒక పాత మిత్రుడు కనబడి, అరగంట  బుర్ర తినేశాడు. వాడు వెళ్ళాక పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్ళా కళ్ళుమూసుకుని కూర్చున్నాడు. “ఇదిగో నాయనా!” అంటూ ఎవరో నుదుటన విభూతి రేకలతో ఉన్న ఒక వ్యక్తి,  ప్రభాకరం పక్కన కూర్చుని, ధ్యానం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక గంటసేపు సుత్తి వేశాడు. ప్రభాకరానికి ఏడుపు వచ్చేసింది.  నాకు ధ్యానం చేసుకునే ప్రాప్తం లేదు అనుకుని నీరసంగా ఇంటికి వచ్చేసాడు.


4)కబుర్లు- శీర్షిక

సమయం విలువ

ఒకసారి అందం, ఆనందం, ప్రేమ, దుఃఖం .. అన్నీ కలిసి  జనసంచారం లేని సముద్ర తీరానికి  షికారుకెళ్లాయి. వేటికి అవి వాటి పద్ధతుల్లో బీచిలో కాలక్షేపం చేస్తున్నాయి. అంతలో ఉన్నట్టుండి పెనుగాలి వీయడం  మొదలు పెట్టింది. తుపాను రాబోతుందని సూచనగా ఆ గాలిహోరు ! చినుకులు కూడా గాలికి తోడయ్యాయి. అంతటితో ఆటపాటలు కట్టిపెట్టి అన్నీ హడావుడిగా తామెక్కి వచ్చిన పడవల కేసి పరుగులు దీశాయి. నింపాదిగా వడ్డున కూర్చుంది  మాత్రం ప్రేమ ఒక్కతే.  తుపాను తేలిపోతుందని దాని ఊహ. ప్రేమ అంచనా తప్పింది. చూస్తుండగానే కారుమబ్బులు గాఢంగా కమ్మేసాయి. తుప్పర్లు కాస్తా తుపాను వర్షంగా  మారడంతో ఇక  లేవక తప్పింది కాదు ప్రేమకు. కానీ అప్పటికే పడవలన్నీ బైలుదేరటానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్క పడవా ఖాళీగా కనిపించలేదు.

అయినా ఆశ చావక ప్రేమ ఆనందాన్ని అడిగింది ,  “ఆనందమా! కాస్త నీ పడవలో ఎక్కించుకోవా!“ ఆవటా అని. ” సారీ ప్రేమా! ఇప్పటికే నా పడవంతా ముత్యాలతో నిండిపోయింది. అంగుళం కూడా జాగా లేదు. ఉంటే నిన్ను ఎక్కించుకోనా!” అంటూ కదిలి ముందుకు వెళ్ళిపోయింది ఆనందం. ఇంతలో అందం పడవ కంటపడింది.  దాన్నీ పడవ ఎక్కించుకోమని ప్రాధేయపడింది ప్రేమ . అందం చిరాగ్గా మొహం పెట్టి “ఇప్పుడే పడవను శుభ్రం చేసుకొన్నా   మిత్రమా! ఇలా మురికి కాళ్ళతో నువ్వెక్కేస్తే మళ్ళీ  శుభ్రం చేసుకోవాలి. నా పరిస్థితి అర్ధం చేసుకో! “ అంటూ పడవ నడుపుకుంటూ  వెళ్ళిపోయింది.

ఆ వెనకే దుఃఖం వస్తూ కనిపించింది పడవను నెమ్మదిగా తోసుకొస్తూ. అదీ ప్రేమ గోలను పట్టించుకునే ధ్యాసలో లేదు. .”పడవంతా నా కన్నీళ్ళతోనే నిండిపోయింది. ఇంకో చుక్క పడ్డా పడవ మునగడం ఖాయం.“అంది సాయం అడిగిన ప్రేమతో. ప్రేమకేం చేయాలో పాలుపోలేదు. సముద్ర తీరంలో ఇలా ఒంటరిగా మిగలాల్సొస్తుందని  ఊహించలేదు. దిక్కు తోచక ఒడ్డునే  కూలబడ్డ ప్రేమ చెవికి ఎక్కణుంచో మాటలు వినిపించాయి. ” ప్రేమా! ఇటు రా! నాపడవలో చాలా  చోటు  ఉంది. ఎక్కు! భద్రంగా నిన్ను ఆవలి వడ్డుకు చేర్చే పూచీ నాదీ! “ ప్రేమకు పరిచయం లేని గొంతు అది! అయినా ఇప్పుడదంతా ఆలోచించే మూడ్ లేదు. ఒక్క వుదుటవ ఒడ్డున ఉన్న పడవలోకి దూకేసింది. తుఫాను క్రమంగా తగ్గుమొఖం పట్టింది. ఈలోగా  పడవా ఆవలి వడ్డుకు చేరింది. అప్పుడు బైటపెట్టింది ప్రేమ తన మనలో మెదిలే సందేహాన్ని. “సమయానికి వచ్చి కాపాడావు. ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఇంతకూ మీ  పేరు ఏంటి మిత్రమా? “

ఆ పడవ సరంగు నవ్వుతూ బదులిచ్చాడు.  ” నాపేరు సమయం” ప్రేమకు సందేహం ఇంకా పూర్తిగా తీరలేదు. “అందం, ఆనందం, దఃఖం … అందరూ నన్ను  వదిలేసి చక్కా వెళ్ళిపోయారు. కానీ నీవు మాత్రం పిలవకుండానే వచ్చి నన్ను రక్షించావు ! ఎందుకూ? ” సమాధానంగా సమయం నవ్వుతూ చెప్పింది, “ఎందుకంటే నాకు నీ విలువ తెలుసు గనక! అందం, ఆనందం, దుఃఖం ‘ప్రేమ’  విలువను గుర్తించలేవు. అందుకే నిన్ను కాపాడే ప్రయత్నం చెయ్యలేదు. కానీ నువ్వు లేకపోతే  సృష్టే  లేదు. ప్రేమ విలువ తెలిసిన  సమయాన్ని నేను. అందుకే పిలవకుండానే వచ్చి నిన్ను కాడింది. ” అంది సమయం.


5)మెదడుకు మేత-సామెత.. శీర్షిక

చెవిటి వాని ముందు శంఖమూదినట్లు!

శంఖనాదం చాలా స్ఫుటంగా, శ్రావ్యంగా, లయాన్వితంగా ఉంటుంది. “భంభం భోలేనాథ్!” అని పరమేశ్వరునికి జయధ్వానం చేస్తారు. అందులో మొదటి రెండు అక్షరాలు శంఖ ధ్వనే! కాని అది చెవిటి వాని ముందు ఊదితే ఏం ప్రయోజనం? అభావంగా చూస్తాడంతే! ఇంకొంచెం అధిక ప్రసంగి అయితే, ఊదుతున్నవాడితో, “ఎందుకు రా అప్పట్నించి దాన్నలా అంచు కొరుకుతున్నావు?”అంటాడు. నవ్వకండి! తమ లోపాన్ని అలా కప్పిపుచ్చుకునే వారు లేరంటారా?

దీనినే పోతనామాత్యుడు తన భాగవతంలోని, సప్తమ స్కంధములో భాగవతాగ్రేసరుడైన ప్రహ్లాదునితో “మహబధిర శంఖారావము” అనిపిస్తాడు. ఈ సామెతకు ఊతంగా బోలెడు సమాంతర విషయాలు ఆ పద్యంలో చెప్పాడా భక్త శిఖామణి. పూర్తి పద్యాన్ని చిత్తగించండి మరి!

శా॥

అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక స

ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ

బంధుత్వంబులు భస్మ హవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ స

ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్

(హరిభక్తిని విడనాడిన వారి జీవితము ఉట్టిది, వేస్టు! గుడ్డివానికి చంద్రోదయంలా, బండచెవిటివానికి శంఖధ్వనిలా, మూగవాడికి మంచి గ్రంథములు నేర్పించినట్లుగా, నపుంసకునికి స్త్రీ కాంక్షలా, కృతజ్ఞతలేని వారితో బంధుత్వముల వలె, బూడిదలో పోసిన హోమ ద్రవ్యాల వలె, పిసినారికి ధనము వలె, పందికి పన్నీరు పరిమళము వలె, అది నిరుపయోగము)

బాబోయ్! ఎన్ని ఉన్నాయో చూడండి! నేను ఉపమాలంకారాలుగా వ్రాశాను గాని, పోతన్నగారు రూపకములు (metaphor) గానే చెప్పారు. ఇంత లోతుగా కాకపోయినా, హస్యం చిందేవి కొన్నున్నాయి! అలాంటిదే, “చాదస్తపు మొగుడు చెబితే వినడు. కొడితే ఏడుస్తాడు” అనేది. ఏది చెప్పినా, ‘నో’అంటారు కొందరు. అదేదో వారి ప్రివిలీజ్ లాగ! అప్పట్లో ‘సీతయ్య’అనే సినిమా వచ్చింది. ‘ఎవరి మాట వినడు’అన్నది ట్యాగ్‌లైన్. చెపుతున్నది మన మంచికా కాదా అని ఆలోచించనక్కర లేదా? మన ట్రంప్ గారు కూడా ఆ బాపతే. కానీ, శంఖం ఊదేవాడు మోదీ గారు కదా! విని తీరవలసిందే.

ఉద్దాలక మహర్షి భార్య చండిక. నిజంగా చండికే. అదలా ఉంచుదాం. ఈ చండిక సీతయ్య టైపు. మగడు ‘యతో’కంటే ఈమె ‘తతో’అంటుంది. ఆమెకు ఆయన చెప్పిందేదైనా ‘మహా బధిర శంఖారావమే’. ఒకసారి ఋషిగారి తండ్రిగారి తద్దినం. ఆమె సంగతి తెలుసు కాబట్టి ఆయన ‘అట్నుంచి నరుక్కుని’వద్దామనుకొన్నాడు. 

“ఈ సంవత్సరం మా నాన్నకు నేనసలు తద్దినం పెట్టనంతే! నా కోసం ఏం ఉద్ధరించాడు?” అన్నాడు. చండిక వెంటనే “ఠాట్! అలా కుదరదు. (ఆమెకు చెవుడు లేదని తమరు గ్రహించాలి) మామయ్యగారు గొప్పవారు! తద్దినం పెట్టాల్సిందే!” అంది.

“పెట్టొచ్చు కాని, మూడు కూరలు, నాలుగో పచ్చడ్లు, గారెలు, బూరెలు ఏం అక్కర్లేదు. సింపుల్‌గా చేద్దాం!”

“నో!! వీల్లేదు. అన్నీ చేస్తా!”.

చెవుడు లేకపోయినా అసలు వినని వాళ్లకు ఇలాంటి స్ట్రాటజీలు ఉంటాయండోయ్!

వచ్చేవారం మరో సామెతతో మళ్లీ కలుద్దాం.


6)నిజాయతీ ఎప్పుడూ మంచిదే! కథ

ఓ ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు. అతను చాలా నిజాయితీపరుడు. తనకున్న చిన్న స్థలంలో కూరగాయలు, పండ్ల మొక్కలు పండిస్తున్నాడు. అత్యాశకు పోకుండా న్యాయబద్ధమైన ధరలకు వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని తోటలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టుకు ప్రతి సంవత్సరం మధురమైన మామిడి పండ్లు కాస్తాయి. ప్రతి వేసవిలో కాసే ఆ మామిడిపళ్ళ కోసం ఆ ఊరి ప్రజలంతా ఎదురుచూస్తుంటారు. ఎప్పటిలాగే ఆ వేసవి కాలం మామిడి పళ్ళు బాగా విరగకాసాయి.

ఈ పళ్ళ గురించి ఆ నోటా ఈ నోటా  పట్నంలో ఉండే ఒక పళ్ళ వ్యాపారికి తెలిసింది. అతడు మామిడి పళ్ళను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి రామయ్య ఉండే ఊరికి వచ్చాడు. రామయ్యతో మాట్లాడటానికి అతడి తోటకు వెళ్లగానే పెద్దగా ఉన్న మామిడి పండ్లను చూసి ఆశ్చర్యపోయాడు. అవి పట్నంలో బాగా ధర పలుకుతాయని ఆశ కలిగింది. రామయ్య మెతకతనాన్ని గ్రహించడంతో అతడికి దుర్బుద్ధి కలిగింది.

“రామయ్యా! మీ మామిడి పండ్లు చాలా రుచికరంగా ఉంటాయని విన్నాను. ఈ చెట్టు పళ్ళన్నీ మీరు నాకే అమ్మాలి. మీకు ఎక్కువ డబ్బు ఇస్తాను” అన్నాడు వ్యాపారి. రామయ్య పళ్ళన్నీ కష్టపడకుండా ఒక్కసారే అమ్ముడవుతున్నందుకు సంతోషంగా అంగీకరించాడు. “మీరు ఈ పండ్లకు ఎంత డబ్బు కోరుకుంటున్నారు?” అని అడిగాడు వ్యాపారి.

“నేను ఎప్పుడూ ఒక పండు పది రూపాయలకు అమ్ముకుంటాను” నిజాయితీగా అన్నాడు రామయ్య. “అయ్యో మా పట్నంలో ఇలాంటి పండ్లకు ఒకదానికి ఆరు రూపాయలే వస్తాయి. నేను మీకు పండుకి ఐదు రూపాయలు ఇస్తాను.” అన్నాడు వ్యాపారి. “అదేంటి పట్నంలో ఎక్కువ ధర వస్తుందని అందరూ అంటారు” అన్నాడు రామయ్య.

“అవి ఇంకా పెద్దవి… ఇవి మధ్యస్థంగా ఉన్నాయి” నమ్మబలికాడు వ్యాపారి. “నేను ఆలోచించి ఏ విషయం రేపు మధ్యాహ్నం చెప్తాను” అన్నాడు రామయ్య. “ఒకసారి చూడండి మీ చెట్టు మీద ఇన్ని పళ్ళున్నా ఒక్క పక్షి కూడా తినడం లేదు. అయితే తీయగా ఉంటాయని అందరూ చెప్తున్నవి అబద్దమే అనిపిస్తుంది” అన్నాడు వ్యాపారి.

“అది కాదండీ నేను పంట చేతికి వచ్చేవరకు పక్షులకు కాపలా ఉంటాను” అని చెబుతున్న రామయ్యని మాట్లాడనివ్వలేదు వ్యాపారి. “మీరు అబద్ధం చెప్తున్నారు. పండు బాగుంటే పక్షి వాలకుండా ఉంటుందా? పోనీలెండి నేను ఆడిన మాట తప్పను కాయకు మీకు ఐదు రూపాయల చొప్పున రుసుము చెల్లిస్తాను” ఉదారం నటిస్తూ అన్నాడు వ్యాపారి.

‘ఏమిటీ వ్యాపారి ఇలా అంటున్నాడు?’ ఆలోచనలో పడ్డాడు రామయ్య. మరుసటి రోజు మధ్యాహ్నం వ్యాపారి తోటకు వచ్చాడు. కానీ అక్కడ దృశ్యం చూసి అతడు  ఆశ్చర్యపోయాడు. నిన్న చెట్టుకి ఉన్నన్ని కాయలు ఈ రోజు లేవు. ఎవరో అవన్నీ కోసేసారు. మిగిలిన పండ్లను పక్షులు కొరుకుతున్నాయి. తోటంతా పక్షుల కిలకిలలతో నిండిపోయింది. “రామయ్యా! పళ్ళన్నీ ఏమయ్యాయి?” కోపంగా అన్నాడు వ్యాపారి.

“నిన్న మీరు వెళ్ళిన తరువాత పట్నం నుండి ఒక షావుకారు వచ్చాడు. అనాథాశ్రమం, వృద్ధాశ్రమాలకు పళ్ళు పంచి పెట్టడానికి కావాలని అడిగారు. నేను అడగకుండానే పండుకి పదిహేను రూపాయల చొప్పున డబ్బు చెల్లించి కొన్నారు. నాకు ఏటా వచ్చే డబ్బులు వచ్చేసాయి. మిగిలిన పండ్లను పక్షులకు ఆహరఒగా వదిలేసాను” అన్నాడు రామయ్య. వ్యాపారి ముఖంలో రంగులు మారిపోయాయి. అతడు మోసం చేయాలనుకున్నా రామయ్య మంచితనమే షావుకారు రూపంలో కాపాడిందని గ్రహించాడు.


7)సన్నిహితం – శీర్షిక

గమ్యం ఎత్తుగా ఉండాలి

నేను నివాసం ఉండేది హైదరాబాద్ లో. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నాను. నా భార్య పుట్టుకతోనే హైదరాబాదీ. అయితే ఎప్పుడైనా సెలవులు వస్తే దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి విజయవాడ వెళ్తూ ఉంటాము. బస్సుల్లోనూ ట్రైన్ లోనూ వెళ్ళడం జరిగేది కొంతకాలం. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత డబ్బులు సమకూర్చుకుని కారు కొనుక్కున్నాం. అప్పటినుండి విజయవాడ దుర్గమ్మ తల్లి ఆలయానికి వెళ్లాలంటే కారులోనే వెళ్ళే వాళ్ళము. డ్రైవింగ్ నేనే చేసేవాడిని. పొద్దున్న టిఫిన్ తిని బయలుదేరే వాళ్ళం. తర్వాత  మా ప్రయాణం మొదలు అయ్యేది. నేను నెమ్మదిగా డ్రైవ్ చేసే వాడిని.అలా కారు నిదానంగా నడిపించుకుంటూ ఒక నాలుగు గంటల సమయంలో విజయవాడ చేరుకునే వాళ్ళం.నాకు అంతసేపు డ్రైవింగ్ చేయడం వల్ల అలసటగా అనిపించేది.

ఇలా కాలం సాగిపోతున్న టైములో వైజాగ్ లో ఉంటున్న మా అమ్మగారికి హార్ట్ ఎటాక్ వచ్చింది. నా బంధువులు ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆ విషయం నాకు సాయంత్రం తెలియజేశారు. ఒకటే కంగారు నాకు. విపరీతమైన దుఃఖం కలిగింది. మా అమ్మ పరిస్థితి ఎలా ఉందో, డాక్టర్స్ ఏమంటున్నారో అన్న టెన్షన్ మొదలైంది. ఇంతలో మా అమ్మగారిని హాస్పిటల్ లో ఎడ్మిట్ చేసిన బావ నాకు ఫోన్ చేసి వీలైనంత తొందరగా రావాలి అని , హార్ట్ కి స్టెంట్ వెయ్యాలి అని , అది నేను అక్కడికి వచ్చి డబ్బు చెల్లిస్తేనే అవుతుంది అని తొందరపెట్టాడు. నాలో టెన్షన్ మొదలైంది. ఫ్లైట్ లో వెళ్దాం అనుకున్నా కానీ నా ఫ్యామిలీ కూడా వస్తాము అనడం తో అందరం కారులో వెంటనే  బయలుదేరాం.ఇంటి దగ్గర బయలు దేరిన దగ్గరనుండి కొంచెం తొందరగానే కారు డ్రైవ్ చేస్తున్నాను.

సిటీ లిమిట్స్ దాటాక స్పీడ్ ఇంకా పెంచాను. నా మనసంతా ఎంత తొందరగా వైజాగ్ చేరుకుందామా అని ఉంది. నా గమ్యం చాలా దూరంగా ఉన్న వైజాగ్ కి డ్రైవ్ చేసుకుంటూ చేరుకోవడం. అలా మా అమ్మకు సంబంధించిన పలు ఆలోచనలతో డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాను. కాసేపటి తర్వాత దాహంగా అనిపించి పక్కన కూర్చున్న నా భార్యను మంచి నీళ్లు ఇవ్వమని అడిగాను. ఆమె ఇచ్చిన నీళ్ల బాటిల్ లో నీళ్ళు తాగక ఎక్కడ దాకా వచ్చాం అని అడిగాను. విజయవాడ దాటేశాం అండి అని చెప్పింది. విపరీతమైన ఆశ్చర్యం కలిగింది నాకు.

అప్పుడే విజయవాడ దాటేశామా అని అవాక్కయ్యాను. అస్సలు అలసట తెలియలేదు అని నివ్వెరపోయాను. అదే స్పీడ్ తో డ్రైవ్ చేసి తెలవారుతుండగా వైజాగ్ చేరుకున్నాం.ఇక్కడ నేను చెప్పాలి అనుకున్నది ఏమిటంటే , జీవితంలో మన గమ్యం ఎత్తుగా ఉండాలి. అప్పుడు ఆ లక్ష్యసాధన లో మనం ఓపిగ్గా ముందుకు వెళతాం. ఆ ప్రయాణంలో చిన్న చిన్న విజయాలను కూడా సొంతం చేసుకుంటాం.అలా కాకుండా చిన్న గమ్యాలను పెట్టుకుంటే అక్కడితో ఆగిపోయి సంతృప్తి పడిపోతాం.మన శక్తి మనం తెలుసుకోకుండా జీవితంలో రాజీ పడిపోతాం.అందుకే మనం ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవాలి జీవితంలో !!!!


వినరో భాగ్యము – శీర్షిక

శ్రీవారికి దొంగల హారతి 

నిండార రాజు నిద్రించే నిద్రయు ఒకటే అండనే బంటు నిద్రయు ఒకటే అని అన్నమయ్య చెప్పినట్టు తిరుమలేశుడైన వెంకటేశ్వర స్వామి కి అందరూ ఒకటే అని చాటి చెప్పే అరుదైన ఉదంతాలెన్నో తిరుమల క్షేత్ర చరిత్రలో కనిపిస్తాయి. అందులో చెప్పుకోదగిన అంశమే దొంగల హారతి . తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాలలో తిరు మాడ వీధుల్లో వివిధ వాహన సేవల్లో భక్తులను ఉభయ దేవేరులతో  కటాక్షించే  స్వామి వారికి రకరకాల హారతులు అందించడాన్ని ఈ తరంలో అందరూ చూడవచ్చు. కానీ ఒకప్పుడు కరుడు కట్టిన దొంగలు కూడా ఉత్సవాలకు వచ్చి హారతులు సమర్పించేవారు. బ్రిటిష్ పాలకులు పాలిస్తున్న రోజుల్లో చంబల్ లోయ ప్రాంతానికి చెందిన పిండారీలు అనే దారి దోపిడీ దొంగలు తాము సంపాదించే సొమ్ములో కొంత స్వామి వారికి సమర్పించడానికి తిరుమలకు వచ్చేవారు. ఒక బృందంగా వచ్చి ఇప్పటి హతిరాం మఠం సమీపంలో నిలబడి ఊరేగుతూ వచ్చే స్వామికి హారతులిచ్చి అధికారులకు తమ వెంట తెచ్చిన డబ్బులు సమర్పించి వెళ్లేవారు. బయట దోపిడీలు చేసే ఆ దొంగలు యాత్రీకుల జోలికి వెళ్లేవారు కారు. ఆ కారణంగానే అందుకే స్థానిక పోలీసు అధికారులు వారిని చూసినా పట్టుకోడానికి ప్రయత్నించేవారు కారు కాలక్రమంలో చట్టాలలో వచ్చిన మార్పులతో వారు తిరుమలకు రావడం మానేశారు. 
ఓం నమో వెంకటేశాయ

మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్
ఐడి. prabhanewscontent@gmail.com

Leave a Reply