ఆల్ ది బెస్ట్.. ఇరగదీసేయ్ !
ఆంధ్రప్రభ : అభిమాన హీరోను కలవడం ప్రతి ఒక్కరి కల. అలాంటి కల నిజమైతే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అలాంటి అరుదైన ఫ్యాన్‌బాయ్ మూమెంట్‌ను సొంతం చేసుకున్నాడు యువ హీరో సుమంత్ ప్రభాస్. రెబల్ స్టార్ ప్రభాస్‌పై ఉన్న అభిమానంతో తన పేరులోనే ప్రభాస్ పేరును చేర్చుకున్న సుమంత్.. తాజాగా తన అభిమాన నటుడిని కలిశాడు.
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కుతున్న ‘రోమన్‌చకం’ చిత్రం రేపు (సెప్టెంబర్ 2) విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన యంగ్ హీరో సుమంత్ ప్రభాస్.. మూవీ విడుదలకు ముందే తన అభిమాన నటుడు ప్రభాస్‌ను కలిసే అవకాశం లభించడంతో ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఈ సందర్భంగా ప్రభాస్ ‘రోమాంచకం’ సినిమాకు శుభాకాంక్షలు చెప్పాడు. కేవలం అభినందనలు మాత్రమే కాకుండా.. ప్రభాస్ స్వయంగా సుమంత్ షర్ట్‌పై “విత్ లవ్ ప్రభాస్” అంటూ ఆటోగ్రాఫ్ ఇవ్వడం ఈ భేటీని మరింత ప్రత్యేకంగా మార్చింది. సుమంత్ ప్రభాస్‌కు ప్రభాస్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. “ఇరగదీసేయ్.. సినిమా బ్లాక్‌బస్టర్ కావాలి. ‘స్పిరిట్’ రికార్డులు దాటాలి” అంటూ ప్రభాస్ చెప్పిన మాటలు వైరల్‌గా మారాయి.
పేరులోనే అభిమానం..
రెబల్ స్టార్ ప్రభాస్ అంటే సుమంత్‌కు చిన్నప్పటి నుంచే ప్రత్యేకమైన అభిమానం. అదే అభిమానంతో తన స్క్రీన్ నేమ్‌లో ప్రభాస్ పేరును జోడించుకున్నాడు. సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత తనకు స్ఫూర్తినిచ్చిన నటుడిని కలవాలన్న కోరిక ఇప్పుడు నెరవేరింది. తన అభిమాన హీరోనే తన సినిమాకు శుభాకాంక్షలు చెప్పడం తన జీవితంలో మరిచిపోలేని క్షణమని సుమంత్ పేర్కొన్నాడు.
‘రోమాంచకం’పై భారీ అంచనాలు
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కుతున్న ‘రోమాంచకం’ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ ప్రభాస్, అనంతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యువతరం కథను కొత్త తరహాలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో చిత్ర బృందం ఉంది. సందీప్ రెడ్డి వంగా సమర్పణ కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సుమంత్ ప్రభాస్ కూడా ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నాడు.
అభిమానిగా మొదలైన ప్రయాణంలో తన అభిమాన నటుడి నుంచి వచ్చిన ఆశీర్వాదం సుమంత్‌కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రభాస్ ఇచ్చిన ప్రోత్సాహంతో ‘రోమాంచకం’పై మరింత నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు ఈ యువ హీరో.
