Suma Kanakala | 25 ఏళ్ల ప్రస్థానం.. సుమ ఎమోషనల్ పోస్ట్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: లైట్లు ఆన్ అయ్యాయి.. కెమెరా రోల్ అవుతోంది.. వేలమంది అభిమానుల కోలాహలం మధ్య ఒకే ఒక్క గొంతు మైక్‌లో మార్మోగింది. పాతికేళ్లుగా తెలుగు చిత్రసీమ వేడుక ఏదైనా, పండగైనా.. ఆమె మాట వినపడాల్సిందే, ఆమె చిరునవ్వు కనిపించాల్సిందే. ఆమే యాంకర్ సుమ.
పాతికేళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. వేలాది జ్ఞాపకాల తీపి సమరం. ఇటీవల జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఒక అద్భుతమైన భావోద్వేగ ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది.
సర్ ప్రైజ్ సీన్.. కళ్లలో నీళ్లు
ఈవెంట్ రన్ షీట్‌లో చివరి వరకు ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా ఉంచిన ఆ ఒక సర్ ప్రైజ్ వీడియో ప్లే అవ్వగానే సుమ కళ్లు ఆనంద భాష్పాలతో మెరిసాయి. జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ‘స్టూడెంట్ నంబర్ 1’ విడుదలైన సమయానికే సుమ కూడా చిత్రసీమకు యాంకర్‌గా ప్రస్థానం ప్రారంభించడం కాకతాళీయమే అయినా, అదొక చరిత్ర. ఆ వేదికపై ప్రదర్శించిన ప్రత్యేక వీడియో ఆమెను పాతికేళ్ల పాత జ్ఞాపకాల లోకంలోకి తీసుకెళ్లింది.
“దర్శకధీరుడు రాజమౌళి గారు నా గురించి చెప్పిన ఆ మాటలు.. ఏదో డిగ్రీ పట్టా అందుకున్నంత అనుభూతినిచ్చాయి” అని సోషల్ మీడియా వేదికగా సుమ ఎమోషనల్ అయ్యారు.
రాజా.. నా లైఫ్‌లోకి వీళ్లందరినీ తెచ్చింది నువ్వే
సినిమాలోని సెకండ్ హాఫ్ ట్విస్ట్ లాగా.. తన కెరీర్ విజయంలో భర్త రాజీవ్ కనకాల పాత్రను సుమ ఎంతో ప్రేమగా ప్రస్తావించారు. “రాజా.. ఇంతమంది గొప్ప వ్యక్తులను, ఇంతటి ప్రేమాభిమానాలను నా జీవితంలోకి తీసుకొచ్చింది నువ్వే” అంటూ భర్తకు ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అమ్మ నేర్పిన పాఠం.. ఫ్యామిలీ అందించిన అభయం
ఒక మలయాళీ పిల్లగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి, ప్రతి ఇంటా సొంత ఇంట్లోని మనిషిగా మారడం వెనుక తన తల్లి ప్రోత్సాహం ఎంతో ఉందని గుర్తుచేసుకున్నారు. తెలుగు భాషపై పట్టు సాధించేలా ప్రోత్సహించడమే కాకుండా, కష్టపడటం.. నిరంతరం నేర్చుకోవడమే విజయానికి రాచబాట అని అమ్మ నేర్పిన సూత్రమే తనను ఇక్కడి వరకు నడిపించిందన్నారు.మరోవైపు ఇంట్లో తల్లి బాధ్యతలను, బయట యాంకరింగ్ వృత్తిని బ్యాలెన్స్ చేసేందుకు తనకు నిరంతరం అండగా నిలిచినా రోషన్ కనకాల, మానస్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
