పేద గర్భిణీలకు సుజనా ఫౌండేషన్‌ అండ

చిట్టినగర్, ఆంధ్రప్రభ: పేద, మధ్యతరగతి గర్భిణీలకు ఆర్థిక భారం లేకుండా వైద్య పరీక్షలు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని సుజనా ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఉచిత 2డీ ఎకో ఆరోగ్య శిబిరాలకు స్పందన లభిస్తోంది. చిట్టినగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వరుసగా నాలుగో మంగళవారం నిర్వహించిన శిబిరంలో 26 మంది గర్భిణీలకు 2డీ ఎకో మాతృ గుండె ప్రమాద పరీక్షలు నిర్వహించారు.
గర్భధారణ సమయంలో నిర్వహించే వైద్య పరీక్షలు తల్లి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడంతో పాటు శిశువు ఎదుగుదలను పర్యవేక్షించడంలో కీలకమని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా గర్భిణీల్లో గుండె సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా ప్రసవ సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

పేద, మధ్యతరగతి మహిళలు వైద్య పరీక్షల కోసం ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సుజనా ఫౌండేషన్‌ ఉచితంగా వైద్య నిర్ధారణ సేవలు అందిస్తోందని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం వరకు కొనసాగిన శిబిరాన్ని గర్భిణీలు సద్వినియోగం చేసుకున్నారు. వైద్యులు విజయ్‌ సుధా, 2డీ ఎకో సాంకేతిక నిపుణురాలు కుసుమ వైద్య సేవలు అందించారు. ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లి ఆరోగ్య పరిరక్షణపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు గర్భిణీలకు సూచనలు చేశారు. సుజనా ఫౌండేషన్‌ సిబ్బంది శిబిర నిర్వహణలో భాగస్వాములయ్యారు. కూటమి నాయకులు నాగోతి రామారావు, వేంపలి గౌరీశంకర్‌ తదితరులు పాల్గొని సేవలందించారు.