పోలీసుల వేధింపులతోనే సుధాకర్ ఆత్మహత్య
భీమ్‌గల్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్!
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ పట్టణానికి చెందిన పొలాస సుధాకర్ స్థానికంగా ఒక చాయ్ హోటల్ నిర్వహిస్తున్నాడు. హోటల్‌ను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచుతున్నారనే నెపంతో పోలీసులు సుధాకర్‌పై కేసులు నమోదు చేశారు. సోమవారం పోలీస్ స్టేషన్‌కు రావాలని అతనికి సమాచారం ఇవ్వడంతో, సుధాకర్ భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ అధికారులు కేసు విషయాన్ని కోర్టుకు తేల్చుకోవాలని సూచించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుధాకర్.. తాను ముందుగానే తెచ్చుకున్న పెట్రోల్‌ను పోలీస్ స్టేషన్ ఆవరణలో పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పి, అతన్ని చికిత్స నిమిత్తం ముందుగా నిజామాబాద్‌లోని జీజీహెచ్‌కు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుధాకర్ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

భీమ్‌గల్‌లో కొనసాగుతున్న బంద్
సుధాకర్ మృతికి స్థానిక కిరాణా వ్యాపారి ఒత్తిడి, పోలీసుల వేధింపులే కారణమని మృతుడు ఆరోపించినప్పటికీ, ఆస్పత్రిలో ఇచ్చిన మరో స్టేట్‌మెంట్ ఆధారంగా “పోలీసుల వేధింపులు కారణం కాదని” సీపీ ప్రకటన జారీ చేశారు. మరోవైపు, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం పోలీసుల వేధింపుల వల్లే సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఎస్సై తిరుపతిపై కేసులు నమోదు చేసి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భీమ్‌గల్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు స్థానిక వ్యాపారులు సంపూర్ణ మద్దతు తెలిపారు. స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి, సుధాకర్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, సుధాకర్‌కు నివాళులు అర్పించడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు ఆయన నివాసంలోనే ముందస్తుగా అరెస్ట్ చేశారు.
