Sudden inspection | గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

Sudden inspection | గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

  • వారం రోజుల్లో అపరిష్కృత సమస్యల పరిష్కారానికి హామీ
  • మంత్రి దృష్టికి దీర్ఘకాలిక సమస్యలు
  • సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ అందజేస్తామని హామీ
  • ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రాకతో ఆనందంలో విద్యార్థినులు

Sudden inspection | జి.కొండూరు, ఆంధ్రప్రభ : జి.కొండూరు మండలంలోని కుంటముక్కల గ్రామంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల (బాలికలు) పాఠశాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఇవాళ‌ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థినులతో సరదాగా గడిపారు. తల్లికి వందనం పథకం అందరికీ వర్తింపజేశారా అని ప్రశ్నించారు. అందరికీ ఈ పథకం కింద సొమ్ము జమ చేసినట్లు వారు తిరిగి సమాధానం ఇచ్చారు. ఇక్కడ భోజనం బాగుంటుందా వారానికి ఎన్నిసార్లు నాన్ వెజ్ భోజనం పెడుతున్నారు..ప్రతిరోజు గుడ్డు ఇస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. భోజనం నాణ్యతతో రుచిగా, శుచిగా ఉంటుందని విద్యార్థినులు సమాధానం చెప్పారు.

ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలున్నాయా అని ప్రశ్నించగా…విద్యార్థినులు సమస్యలు ఏమీ లేవని చెప్పడంతో అబద్దం చెబుతున్నారంటూ బాలికలతో మాట కలిపారు. కాలక్రమంతో పాటు ఇటీవల బుడమేరు వరదకు వసతి భవనం శిథిలమవ్వడంతో విద్యార్థినులు తరగతి గదుల్లోనే నిద్రించడం తెలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చలించారు. వారి సమస్యలు తానే చెప్పి వారంలోగా సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Sudden inspection

విద్యార్థినుల కోరికపై స్వయంగా సెల్ఫీ తీశారు. దీన్ని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామికి పంపి ఇక్కడి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. ప్రైవేట్ స్కూళ్ళ కంటే ప్రభుత్వ స్కూళ్ళేం తక్కువ కాదంటూ విద్యార్థినులతో మాటామంతీ కలిపారు. తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రథాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రభుత్వ స్కూల్లోనే చదివామంటూ పేర్కొన్నారు.

ఇక్కడ చదివే విద్యార్థినులు 525 మార్కులు దాటిన ప్రతి విద్యార్థినికి స్కాలర్ షిప్స్ ఇస్తామని ప్రకటించారు. విద్యార్థినులకు తన సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ ఇస్తానన్నారు. క్రీడా మైదానం అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు. డార్మిటరీ, టాయిలెట్స్, వాష్ రూమ్స్ లో వాటర్ సమస్యలు, ప్రహరిగోడ నిర్మాణం, ఐ.ఎఫ్.బి ప్యానెల్స్ ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యంలో లోపాలు, తదితర సమస్యలను గుర్తించారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

Sudden inspection

ఇక్కడి విద్యార్థునులు జె.ఈ.ఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ లాంటి జాతీయ పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి, ఈ గురుకుల పాఠశాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని వెల్లడించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆకస్మిక రాకతో గురుకుల పాఠశాల విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు. థాంక్యూ ఎమ్మెల్యే సార్ అంటూ వారి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply