మంచినీళ్ల బావిలో సైడ్ బోర్ల విజయవంతం…

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : ఇటుకలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నరసింగాపురం నల్లాల బావి వద్ద గ్రామ ప్రజల నీటి అవసరాలను తీర్చే దిశగా కీలక చర్యలు చేపట్టారు. శనివారం 12 రోజున బావి వద్ద సైడ్ బోర్లు వేయించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెరుగు సుమలత శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం మూడు సైడ్ బోర్లు 300 అడుగుల లోతుతో త్రవ్వించగా, అందులో రెండు బోర్లు విజయవంతంగా నీటిని అందిస్తున్నాయి. ఒక బోరు ఫెయిల్ అయినప్పటికీ, మిగతా రెండు బోర్లు సమృద్ధిగా నీరు ఇవ్వడం గ్రామానికి శుభసూచకంగా మారింది.
గ్రామంలో పెరుగుతున్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, పాత బోరుబావిని పునరుద్ధరించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ బోర్ల ద్వారా గ్రామ ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మెరుగు సుమలత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసం ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. “గ్రామంలో కరెంట్, రోడ్లు, నీటి సమస్యలు వంటి అన్ని అంశాలలో ప్రజలకు అండగా ఉంటానునీ గ్రామ ప్రజల సహకారంతో ఇటుకాలపల్లిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం” అని ఆమె అన్నారు.
అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ చురుకుగా పాల్గొని సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో నీటి సమస్యకు కొంతవరకు పరిష్కారం లభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
