విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి…

సామాజిక విలువలు, క్రమశిక్షణ అంశాలు బోధించాలి..
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్


సిరిసిల్ల, సెప్టెంబర్ 5 (ఆంధ్రప్రభ) : విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడంతో మిగతా వారికి మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రుల తరువాత విద్యార్థులపై ప్రభావం చూపేది ఉపాద్యాయులేనని స్పష్టం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, మహాత్మా జ్యోతి రావు పూలే దంపతుల బోధనలు స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. టీచర్లు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతి విద్యార్థి మనో వికాసం, సమాజ విలువలు, కట్టుబాట్లు, క్రమశిక్షణ అంశాలపై బోధించాలని సూచించారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెంచాలని, అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఉదయం పూట టిఫిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.