ప్రభుత్వ పాఠశాలల్లో ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్‌’ ప్రారంభం

  • విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రత, విద్యా ప్రగతికి పౌష్టికాహారం దోహదం: ఏఎంసీ చైర్‌పర్సన్‌ తిరుమల

కాటారం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కాటారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పంతకాని తిరుమల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్‌’ పథకాన్ని సోమవారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లలో చైర్‌పర్సన్‌, సర్పంచులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రారంభించారు.

గంగారం మోడల్‌ స్కూల్‌లో అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పంతకాని తిరుమల మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. విద్యార్థులకు పౌష్టికమైన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రత మెరుగుపడటంతో పాటు పాఠశాల హాజరు, విద్యా ప్రగతి పెరుగుతాయని తెలిపారు.

విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పంతకాని సడువలి, రాజయ్య, బండం శోభారాణి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు తెప్పల దేవేందర్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి స్వప్నరెడ్డి, డీసీసీ కార్యదర్శి అంగజాల అశోక్‌, డీసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి ఆలుబాక సుజాత, పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.