Students | గురుకులంలో దారుణం..
- విద్యార్థులపై గురువు దాష్టీకం..
- 20 మంది విద్యార్థుల పై పైపులతో ఉపాధ్యాయుడు దాడి..
- ఒంటిపై వాతలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు..
- గురుకులం వద్ద ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు..
Students, నాయుడుపేట, ఆంధ్రప్రభ : గురుకుల పాఠశాలలు.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే పవిత్ర స్థలాలు.. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు విద్యార్ధుల పై కర్కోశకంగా వ్యవహరించి పైపులతో దాడి చేయడం.. వాతలుపెట్టిన ఘటన తిరుపతి (Tirumala) జిల్లా ఓజిలి మండల పరిధిలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ఏకలవ్య గురుకుల పాఠశాలో ఇతర రాష్ర్టానికి చెందిన హిందీ ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరి అమానుష చర్యల కారణంగా ఆ గురుకులం ఇప్పుడు అరాచకానికి అడ్డాగా మారింది. శనివారం రాత్రి ఓజిలి మండలం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉపాధ్యాయుడి దాస్టికం వెలుగుచూడడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చరిత్ర బోధించే అరుణ్ అనే ఉపాధ్యాయుడు ఏడవ తరగతిలో చదువుతున్న విద్యార్థుల పై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన బహిర్గతమైంది. ఒక్క విద్యార్థి చేసిన తప్పుడు ప్రవర్తనను కారణంగా చూపిస్తూ తరగతిలోని మిగిలిన సుమారు 20 మంది విద్యార్థులందరి పై చెట్లకు నీళ్లు పట్టేందుకు ఉపయోగించే డ్రిప్ పైపులతో తీవ్రంగా కొట్టినట్లు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపించారు. బాలురు మాత్రమే కాదు విద్యార్థినులు కూడా దాడికి గురయ్యారని సమాచారం. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే గురుకులం ఎదుటకు చేరుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా ఓజిలి ఎస్ఐ శ్రీకాంత్ తన సిబ్బందితో కలిసి సంఘటన పై విచారణ ప్రారంభించారు. బాధిత విద్యార్థులను వ్యక్తిగతంగా విచారిస్తూ నిజానిజాలు వెలికితీసేందుకు పోలీసులు (Police) రంగంలోకి దిగారు. మా పిల్లలను ఇంతలా దండించే చదువులు మాకు వద్దు బాబోయ్ అని కన్నీటి పర్యంతమై తల్లిదండ్రులు బాధ వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే గురుకుల పాఠశాలలో ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే దాడికి పాల్పడిన ఉపాధ్యాయులు.. మాది సెంట్రల్ గవర్నమెంట్.. ఎవరు ఏం చేయలేరు అంటూ అధికారులతో పాటు తల్లిదండ్రులు, మీడియా వారిని కూడా బెదిరిస్తున్నారు.



