విద్యార్థుల భద్రతే లక్ష్యం..
స్కూల్, కళాశాల బస్సులకు ఎస్పీ కొత్త మార్గదర్శకాలు
డాష్‌బోర్డ్ కెమెరాలు తప్పనిసరి..
పోలీస్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేయాలని ఆదేశం
ఏలూరు టౌన్, ఆంధ్రప్రభ : ఏలూరు జిల్లాలో విద్యార్థుల సురక్షిత ప్రయాణమే ప్రధాన లక్ష్యంగా పాఠశాలలు, కళాశాలల బస్సుల భద్రతా ప్రమాణాలపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి రవాణా శాఖ అధికారులు, వివిధ విద్యాసంస్థల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పాఠశాల, కళాశాల బస్సులో తప్పనిసరిగా డాష్‌బోర్డ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వీటి ద్వారా బస్సు ముందు, వెనుక భాగాల్లోని పరిస్థితులతో పాటు డ్రైవర్ పనితీరును కూడా నిరంతరం రికార్డు చేయవచ్చని తెలిపారు.
ప్రతి బస్సులో ఏర్పాటు చేసే కెమెరాలను పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసే విధంగా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు లేదా ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ల నియామకంలో విద్యాసంస్థలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. డ్రైవర్లను నియమించే ముందు వారి గత చరిత్రను తప్పనిసరిగా పరిశీలించాలని, నేర నేపథ్యం లేని బాధ్యతాయుతమైన వ్యక్తులను మాత్రమే నియమించాలని సూచించారు. ప్రతి బస్సు డ్రైవర్‌కు యూనిఫాం, గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండేలా చూడాలని, డ్రైవర్ వివరాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎస్పీ చేపట్టిన ఈ భద్రతా చర్యలను విద్యాసంస్థల యాజమాన్యాలు స్వాగతించాయి. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సూచించిన నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌టీవో శేఖర్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ విఠల్‌తో పాటు వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
