పాఠశాల గోడ కూలి విద్యార్థి మృతి.. మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి
ఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు
పార్వతీపురం మన్యం జిల్లా, ఆంధ్రప్రభ: సాలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలిన ఘటనలో పదో తరగతి విద్యార్థి అరుణ్ తేజ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మరో విద్యార్థి గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి సంధ్యారాణి.. మంత్రి నారా లోకేష్‌కు వివరించారు. పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
విద్యార్థి అరుణ్ తేజ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి పేర్కొన్నారు. బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థిని కోల్పోవడం బాధాకరమన్నారు. అరుణ్ తేజ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఘటనలో గాయపడిన మరో విద్యార్థికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబానికి రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
పాఠశాల ప్రహరీ గోడ కూలిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఘటనకు గల కారణాలను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
