నీటి వనరుల పరిరక్షణకు పటిష్ట చర్యలు

ప్రతి వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా చర్యలు
చెరువులు, కాలువల్లో ఆక్రమణలను గుర్తించి తొలగించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: జిల్లాలోని నీటి వనరులను పరిరక్షిస్తూ ప్రతి వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నీటిపారుదల శాఖ పనితీరుపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల్లో ఆక్రమణలకు తావివ్వొద్దని సూచించారు. చిన్నతరహా నీటిపారుదల చెరువుల కట్టల పటిష్టత, తూముల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో మరమ్మతు పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు.

కాలువల్లో పేరుకుపోయిన పూడిక, పిచ్చిమొక్కలను తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. కాలువల భూముల్లోని ఆక్రమణలను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నీటి వనరుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

సమావేశంలో నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.