ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు కృషి

ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు కృషి

  • ఆర్థిక స్వావలంబనకు స్వయం ఉపాధి కీలకం
  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రైజ్ సెంటర్ ద్వారా మహిళల చేతి వృత్తులపై శిక్షణ ఉపాధి అవకాశాలకు వర్క్ షాప్ లు నిర్వహించి ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిదేందుకు కృషి చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. మండల పరిధిలోని గుంటుపల్లిలో ఏర్పాటు చేసిన రైజ్ శిక్షణ కేంద్రంలో సోలార్ ఫొటోవాల్టిక్ టెక్నిషన్ శిక్షణ పొందిన 28 మంది మహిళలకు టూల్ కిట్లు, సర్టిఫికెట్లను కలెక్టర్ అందజేశారు.

అనంతరం 50 మంది మహిళలకు తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన, సుస్థిర భవిష్యత్ కు స్వయం ఉపాధి మార్గాలు కీలక పాత్ర వహిస్తాయన్నారు. రైజ్ సెంటర్ ద్వారా మహిళలు నేర్చుకున్న నైపుణ్యాలను ఉపాధిగా మార్చుకుని ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, సహాయక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అడుగులు వేయాలన్నారు.

మహిళలు పొందుతున్న శిక్షణను కేవలం నేర్చుకోవడానికే పరిమితం కాకుండా, ఆచరణలోకి తీసుకువచ్చి ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలను వినియోగించుకుని పారిశ్రామిక, వ్యాపార యూనిట్లు ప్రారంభించాలన్నారు. మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న వాసవ్య మహిళా మండలి గోకుల్ ఎంటర్ ప్రైజెస్ సంస్థల ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎ.ఎస్.వి.నాంచారరావు, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు కీర్తి, గోకుల్ ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్ వడ్డి సంతోషి లక్ష్మి, మహేష్, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply