చట్టాలను చేతిలో తీసుకుంటే కఠిన చర్యలు: ఎస్సై రవికుమార్

  • జైనూర్ ప్రాంతంలో శాంతిభద్రతలపై పోలీసు శాఖ ప్రకటన

జైనూర్, ఆంధ్రప్రభ: జైనూర్ ప్రాంతంలో శనివారం జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ఎస్సై రవికుమార్. కొందరు వ్యక్తులు గతంలో విక్రయించిన భూముల్లోకి అక్రమంగా ప్రవేశించి, బౌండరీ గోడలను ధ్వంసం చేయడం, ట్రాక్టర్‌తో ప్లాట్లను దున్నడం వంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు.

అలాగే, ఆయా భూముల యజమానులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఆ స్థలాలను ఖాళీ చేయాలని బెదిరించినట్లు ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. అదేవిధంగా, ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్న ఒక విద్యాసంస్థకు సంబంధించి, భవనం ఖాళీ చేయాలని బెదిరించడం, విద్యాసంస్థ సిబ్బందిని భయపెట్టడం వంటి ఘటనలపై కూడా పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదులు అందిన‌ట్టు తెలిపారు.

ఈ ఫిర్యాదులపై పోలీస్ అధికారులు సంఘటనా స్థలాలకు వెళ్లి విచారణ చేపట్టే సమయంలో, తమ విధులకు అడ్డుపడిన ఘటనలు కూడా నమోదయ్యాయని ఎస్సై వివరించారు. ఈ ఘటనల్లో సంబంధిత వ్యక్తులపై రెండు కేసులు నమోదు చేసిన‌ట్టు ఎస్సై తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, జైనూర్ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ చేపట్టిందని, అవసరమైన నివారణ చర్యలు అమలు చేస్తున్నామని అన్నారు.

ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే ఉపేక్షించేది లేద‌ని ఎస్సై హెచ్చరించారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడే వారు ఎవరైనా సరే, వారిపై కఠిన చర్యలు తీసుకొని శిక్ష విధిస్తామని అన్నారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించి, పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని ఎస్సై రవికుమార్ కోరారు.

Leave a Reply