ఖమ్మం కార్పొరేషన్లో పౌర సేవలు కుంటుపడ్డాయి
- వీధిలైట్లు, పారిశుధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: బీఆర్ఎస్ నగర నాయకులు
ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో నెలల తరబడి వీధిలైట్లు వెలగకపోవడం, పారిశుధ్య సమస్యలు పేరుకుపోవడం, పౌర సేవలు సక్రమంగా అందకపోవడంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఖమ్మం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ప్రధానంగా నగరంలోని పలు డివిజన్లలో మూడు, నాలుగు నెలలుగా వీధిలైట్లు వెలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాడైన లైట్లకు మరమ్మతులు చేయడం లేదా కొత్త లైట్లు ఏర్పాటు చేయడం లేదని నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేక చెత్త, మురుగు పేరుకుపోవడంతో దోమల బెడద పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. వర్షాకాలంలో ముందస్తు పారిశుధ్య చర్యలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ అధికారులు తగిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు పరిమితమవుతున్నారనే విమర్శలు ప్రజల్లో ఉన్నాయని, అయితే క్షేత్రస్థాయిలో పౌర సమస్యల పరిష్కారంపై మరింత దృష్టి అవసరమని అన్నారు.
గతంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో తెల్లవారుజామునే కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులను వెంటబెట్టుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని అధికారులను అప్రమత్తం చేసేవారని బీఆర్ఎస్ నాయకులు గుర్తుచేశారు.
ప్రస్తుతం వీధిలైట్లు, పారిశుధ్యం, పౌర సేవలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక పౌర సేవలను మెరుగుపరచడంలో నిర్లక్ష్యం కొనసాగితే, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మాజీ అధ్యక్షులు పగడాల నాగరాజు, మాజీ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బుల్, మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి ప్రసాద్, మాజీ కార్పొరేటర్ శీలంశెట్టి వీరభద్రం, మాటేటి నాగేశ్వరరావు, బుర్రి వెంకట్, దండా జ్యోతి రెడ్డి, పసుమర్తి రాంమోహన్ మెంతుల శ్రీశైలం, బుర్రి వినయ్, ఆరంపుల వీరభద్రం, చెన్నబోయిన ఉదయ్,సైదా హుస్సేన్, పోలేపొంగు వెంకట్, షేక్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
