ఇస్లామాబాద్ : పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం అర్ధరాత్రి పాకిస్తాన్, పీఓకేలోని 9 ప్రదేశాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సైనిక చర్య జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయాలతో సహా 9 ప్రదేశాలను ధ్వంసం చేసింది. భారత సైనిక దళాలు చేసిన ఈ దాడిలో 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అణ్వాయుధ దాడి చేస్తామని, బలమైన ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. యుద్ధం ఆపండి మహా ప్రభో అంటూ భారత్ ముందు మోకరిల్లుతోంది.
పహల్గామ్ దాడి తర్వాత భారత్ దౌత్యపరమైన చర్యలు తీసుకున్న తర్వాత, పాకిస్తాన్ అగ్ర నాయకులందరూ ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు పొరుగు దేశంలో నిశ్శబ్దం నెలకొంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే పాకిస్తాన్ ఇప్పుడు కాల్పుల విరమణ ప్రకటించింది. మమ్మల్ని మేము రక్షించుకుంటామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడుతూ.. భారతదేశం ఎటువంటి తదుపరి చర్య తీసుకోకపోతే, మేము కూడా ఏమీ చేయమని తెలిపారు.
ఖ్వాజా అహంకారం కొన్ని గంటల్లోనే మాయం..
భారత్ చర్య తర్వాత, నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నామని ఖవాజా ఆసిఫ్ చెప్పడం గమనార్హం. భారతదేశం తన గగనతలం నుంచి పాకిస్తాన్ ప్రాంతాలలో ఈ దాడులను నిర్వహించిందని కూడా ఆయన అన్నారు. దీనికి తగిన సమాధానం ఇస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి పేర్కొన్నారు. అయితే, అతను కొన్ని గంటల్లోనే తన ప్రకటనను విరమించుకున్నాడు. ఇప్పుడు భారతదేశం ఏదైనా ఇతర చర్యలు తీసుకోకపోతే తాము ఏమీ చేయమని చెప్పాడు.