Sensex | క్షణాల్లో రూ.4 లక్షల కోట్లు ఆవిరి..

Sensex | ఆంధ్రప్రభ, ముంబై : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ భారీగా పెరగడం, పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు మరింత తీవ్రమవడం, అమెరికా కొత్త సుంకాల ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే కీలక సూచీలు కుప్పకూలగా, మదుపర్ల సంపద క్షణాల్లోనే సుమారు రూ.4 లక్షల కోట్లు ఆవిరైంది.

ఉదయం ప్రారంభ‌ సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 715 పాయింట్లు కోల్పోయి 75,675 వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 198 పాయింట్లు పతనమై 23,671 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 96.58 వద్ద నమోదైంది.

నిఫ్టీలో సిప్లా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్‌జీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కోల్ ఇండియా షేర్లు స్వల్ప లాభాల్లో ఉండగా.. ఇన్ఫోసిస్, ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో, ఇండిగో షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్..

అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 100 డాలర్ల మార్క్‌ను దాటింది. గత నెల రోజుల్లోనే చమురు ధరలు దాదాపు 40 శాతం పెరగడం గమనార్హం. దీంతో ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఉద్రిక్తతలే ప్రధాన కారణం..

ఎర్ర సముద్రంలో నౌకలపై హూతీల దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. వరుసగా 13వ రోజు ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు కొనసాగించినట్లు సమాచారం. ఈ పరిణామాలు ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

అమెరికా సుంకాల ప్రభావం..

ఇదిలా ఉండగా, వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా మరోసారి సుంకాలు విధించింది. బలవంతపు కార్మిక వ్యవస్థ (వెట్టి చాకిరీ) అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్‌తో పాటు 60 దేశాలపై 10 నుంచి 12.5 శాతం వరకు టారిఫ్‌లు విధించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం కూడా దేశీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని మరింత పెంచినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.