Stock market | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
Stock market | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
1109 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
22,700 ఎగువకు నిఫ్టీ
Stock market | ముంబై, ఆంధ్రప్రభ: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్ల జోరుతో మార్కెట్లు దూసుకెళ్లాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో ఐటీ రంగంలో ఉత్సాహం నెలకొంది. దీంతో నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 5 శాతం మేర లాభపడింది. మరోవైపు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ)ను సమీక్షిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడంతో పీఎస్‌యూ బ్యాంకులు, రియల్టీ షేర్లలోనూ కొనుగోళ్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ దేశీయ సూచీలు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి.
సెన్సెక్స్ ఉదయం 71,951.73 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. తొలుత పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీ.. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుంది. ఇంట్రాడేలో 73,045.67 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1,109.10 పాయింట్ల లాభంతో 73,033.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 358.60 పాయింట్లు పెరిగి 22,721.95 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్-30లో కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎటర్నల్, మారుతీ సుజుకీ మినహా మిగిలిన షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. హిందుస్థాన్ యూనిలీవర్ షేరు కూడా లాభపడింది. ఐటీ రంగంలో సానుకూల పరిణామాలు, ఇతర రంగాల్లో కొనుగోళ్ల మద్దతు మార్కెట్ల భారీ లాభాలకు దోహదపడ్డాయి.
